18 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అయేషా నజీం... 2022 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఆడిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్

18 ఏళ్లు... చాలామంది క్రికెటర్లు అండర్19 టీమ్‌లోకి రావాలని కోరుకునే వయసు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలని కోరుకునే క్రికెటర్లకు ఇది కీలకమైన టర్నింగ్ పాయింట్. అయితే 2022 టీ20 వరల్డ్ కప్ ఆడిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్ అయేషా నజీం, 18 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ అవాక్కయేలా చేసింది..

 18 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఇవ్వడం కంటే దానికి ఆమె చెప్పిన కారణం... మరింత షాకింగ్‌గా ఉంది. 2020లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అయేషా నజీం... 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించింది. 

పాకిస్తాన్ తరుపున 3 వన్డేలు, 25 టీ20 మ్యాచులు ఆడిన అయేషా నజీం... వన్డేల్లో 33 పరుగులు చేయగా టీ20ల్లో 286 పరుగులు చేసింది. భారీ షాట్లు ఆడుతూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో తన హిట్టింగ్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేసింది అయేషా నజీం..

జనవరి 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 45 పరుగులు చేసింది అయేషా నజీం. ఇందులో 3 భారీ సిక్సర్లు, ఓ ఫోర్ ఉన్నాయి. ఈ పర్ఫామెన్స్‌ని వీక్షించిన పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్... అయేసాని ఫ్యూచర్ టాలెంట్‌గా ప్రశంసించాడు. 

కొన్ని కోట్ల మంది మహిళలు, అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని కలలు కంటుంటే టీనేజ్ వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన అయేషా నజీం, ఇస్లాం మతాచారాలకు కట్టుబడి మిగిలిన జీవితం గడిపాలని నిర్ణయం తీసుకుంది...

ఇస్లాం మతాచారం ప్రకారం మహిళలు క్రీడల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఈ కారణంగానే తాలిబన్లు, ఆఫ్ఘాన్ మహిళా క్రికెట్ టీమ్‌ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 ఇస్లాం మత కట్టుబాట్లకు తగ్గట్టుగా తన జీవితాన్ని సాగించాలని అనుకుంటున్న అయేషా నజీం... క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఇకపై ఇస్లాం మత గొప్పదనాన్ని చాటిచెబుతూ ఖురాన్ బోధించబోతున్నట్టు ప్రకటించింది అయేషా నజీం.. అయేషా నజీం రిటైర్మెంట్‌తో పాకిస్తాన్ మహిళా క్రికెట్ టీమ్‌‌లో మిగిలిన వారిపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. 

Scroll to load tweet…

ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘దంగల్’ సినిమాలో చిన్ననాటి గీతా ఫోగట్‌గా నటించిన జైరా వసీం కూడా ఇదే రకమైన కారణాలతో యాక్టింగ్ కెరీర్‌కి మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టేసింది. 15 ఏళ్ల వయసులో ‘దంగల్’ సినిమాలో ఆమీర్ ఖాన్‌తో పోటీపడి నటించి మెప్పించిన జైరా వసీం, తాను యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల చాలామంది తనను దూషిస్తున్నారంటూ పేర్కొంది.

కొన్నాళ్లకే ఇస్లాం మతాచారాలకు విరుద్దమైన నటనలో తాను కొనసాగలేనంటూ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది.