ప్రపంచ కప్ వంటి  మెగాటోర్నీలో జట్టును ముందుండి నడిపించడంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విమర్శలపాలయ్యాడు. ఇప్పటికీ అతడిపై పాక్ మాజీలతో పాటు అభిమానులు గుర్రుగా వున్నారు. ఇలా సొంత దేశానికి చెందిన అభిమానులే కెప్టెన్సీ బాధ్యతల నుండి అతన్ని తప్పించాలని కోరుతున్నారంటే ఏ స్థాయిలో ద్వేశిస్తున్నారో అర్థమవుతుంది. ఇలా ఇప్పటికే బోలెడు వివాదాలతో సతమతమవుతున్న అతడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.

మరికొద్దిరోజుల్లో బక్రీద్ పండగ జరగనున్న నేపథ్యంలో అతడు అభిమానులకు ముందుస్తుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశాడు. అయితే పండగ రోజున బలి ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ఓ గోవు ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇలా హిందువులు పవిత్రంగా భావించే గోవును బలివ్వనున్నట్లు పేర్కొనడమే వివాదానికి దారితీసింది. జంతుబలిని ప్రేరేపించేలా ట్వీట్ చేసిన అతడిపై జంతు ప్రేమికులతో పాటు హిందుత్వవాదులు సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడుతున్నారు. 

''పవిత్ర పండుగా  బక్రీద్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి...వేదిక తయారయ్యింది. బలి కోసం ఈ  గోవు కూడా సిద్దంగా వుంది. పండగ రోజు కోసమే మేమంతా  ఎదురుచూస్తున్నది.'' అంటూ సర్ఫరాజ్ ట్వీట్ చేయడమే కాకుండా ఓ గోవు ఫోటోను కూడా ట్వీట్ కు జతచేశాడు.

సర్పరాజ్ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా భారత అభిమానులు, జంతు ప్రేమికులు, నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. బహిరంగంగా మూగ జీవాల్ని వధిస్తామంటుంటే అంతర్జాతీయ సమాజం ఎందుకు మౌనంగా వుంటోందని వారు ప్రశ్నిస్తున్నారు.  అలాగే పెటా  వంటి సంస్థలు చొరవ తీసుకుని అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.