టెస్టుల్లో 7వ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజమ్... ఒంటరి పోరాటంతో శ్రీలంక ఆధిక్యాన్ని తుడిచిపెట్టేసిన పాకిస్తాన్ కెప్టెన్... ఆసక్తికరంగా మారిన శ్రీలంక వర్సెస్ పాక్ తొలి టెస్టు...
బీభత్సమైన ఫామ్‌లో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో సూపర్ సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక పర్యటనలో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మాస్టర్ క్లాస్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు బాబర్ ఆజమ్...
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 89.1 ఓవర్లలో 222 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ కరుణరత్నే 1 పరుగు చేసి అవుటై మరోసారి నిరాశపరిచాడు. ఒషాడా ఫెర్నాండో 35, కుశాల్ మెండీస్ 21 పరుగులు చేయగా ఏంజెలో మాథ్యూస్ 15 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు...
ఆసీస్‌పై డబుల్ సెంచరీ చేసి అదరగొట్టిన దినేశ్ చండీమల్ 115 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లోయర్ ఆర్డర్‌లో మహీశ్ తీక్షణ 65 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...
ఒకానొక దశలో 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఈ దశలో ఆఖరి రెండు వికెట్లకు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు తీక్షణ, ఛండీమల్... పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ 4 వికెట్లు తీయగా హసన్ ఆలీ, యషీర్ షా రెండేసి వికెట్లు తీశారు...
అయితే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్ వరుస వికెట్లను కోల్పోయింది. ఇమామ్ వుల్ హక్ 2 పరుగులు, అజర్ ఆలీ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరగా అబ్దుల్లా సఫీక్ 13, మహ్మద్ రిజ్వాన్ 19, అఘ సల్మాన్ 5, నవాజ్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. షాహీన్ ఆఫ్రిదీ డకౌట్ కావడంతో 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్...
ఈ దశలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి భాగస్వామ్యాలు నిర్మిస్తూ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. 18 పరుగులు చేసిన యషీర్ షాతో కలిసి 8వ వికెట్‌కి 27 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బాబర్ ఆజమ్, 17 పరుగులు చేసిన హసన్ ఆలీతో కలిసి 36 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు...
148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో నసీం షాతో కలిసి ఆఖరి వికెట్‌కి 70 పరుగులు జోడించిన బాబర్ ఆజమ్... టెస్టుల్లో 7వ సెంచరీ నమోదు చేశాడు. 244 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 119 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, పాకిస్తాన్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఇంజమామ్ వుల్ హక్ రికార్డును సమం చేశాడు...
ఇంజమామ్ వుల్ హక్ మూడు ఫార్మాట్లలో కలిపి 131 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు నమోదు చేయగా బాబర్ ఆజమ్ 70 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును సమం చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో కలిపి బాబర్ ఆజమ్‌కి ఇది 25వ సెంచరీ. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 25 సెంచరీలు నమోదు చేసిన పాక్ బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు బాబర్ ఆజమ్. ఇంతకుముందు సయ్యద్ అన్వర్ 246 ఇన్నింగ్స్‌ల్లో 25 సెంచరీలు బాదగా, బాబర్ ఆజమ్ 228 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును అందుకున్నాడు...
బాబర్ ఆజమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా 90.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్. శ్రీలంక జట్టుకి 4 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 5 వికెట్లు తీయగా రమేశ్ మెండీస్, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు తీశారు. రజితకి ఓ వికెట్ దక్కింది...
