Babar Azam: పాకిస్తాన్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా పాక్ సారథి బాబర్ ఆజమ్ సెంచరీతో కదం తొక్కాడు. అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. 

స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో పాక్.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే భారీ లక్ష్య ఛేదనలో పాక్ సారథి బాబర్ ఆజమ్.. 107 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇమామ్ ఉల్ హక్ (65), మహ్మద్ రిజ్వాన్ (59) లతో పాటు ఖుష్దిల్ షా (23 బంతుల్లో 41 నాటౌట్.. 1 ఫోర్, 4 సిక్సర్లు) లు మెరుగ్గా ఆడి పాక్ కు విజయాన్ని అందించారు. 

కాగా ఈ మ్యాచ్ లో ఆజమ్ సెంచరీతో రాణించడంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తనకు దక్కిన అవార్డును ఆజమ్.. ఖుష్దిల్ షా కు ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

లక్ష్య ఛేదనలో ఆజమ్ పరిస్థితులకు తగ్గట్టుగా రాణించినా చివర్లో ఖుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన రొమారియా షెపర్డ్ వేసిన ఓవర్లో.. వరుసగా 3 సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను పాక్ వైపునకు తిప్పాడు. 49వ ఓవర్లో ఖుష్దిల్.. 4, 6 తో బాది పాక్ ను విజయానికి చేరువచేశాడు. ఈ విజయంతో పాక్.. సిరీస్ లో 1-0తో నెగ్గింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడంతో అతడు దానిని ఖుష్దిల్ కు ఇవ్వాలని కోరాడు. ఆజమ్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to load tweet…