PAK vs WI: స్వదేశంలో  వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో పాకిస్తాన్ చెలరేగి ఆడుతోంది.  కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు ఓపెనర్  ఇమామ్ ఉల్ హక్ లు రెచ్చిపోవడంతో మరోసారి ఆ జట్టు విండీస్ పై జయకేతనం ఎగురవేసింది.

తొలి వన్డేలో వెస్టిండీస్ తో పోరాడి గెలిచిన పాకిస్తాన్ రెండో వన్డేలో ఏ హడావిడి లేకుండా పనికానిచ్చింది. ముల్తాన్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బాబర్ ఆజమ్ సారథ్యంలోని ఆ జట్టు.. 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (72), బాబర్ ఆజమ్ (77) లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్.. 32.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్.. 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫకర్ జమాన్ (17) త్వరగా ఔటయ్యాడు. కానీ ఇమామ్ ఉల్ హక్ (72) తో కలిసి బాబర్ ఆజమ్ (77) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 125 పరుగులు జోడించారు. అయితే సమన్వయ లోపం వల్ల ఇమామ్ రనౌట్ అయ్యాడు. 

హాఫ్ సెంచరీలు సాధించిన క్రమంలో బాబర్ తో పాటు ఇమామ్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరికీ ఇది వరుసగా ఆరో అర్థ సెంచరీ కావడం విశేషం. ఇక పాక్ ఇన్నింగ్స్ చివర్లో షాదాబ్ ఖాన్ (22), ఖుష్దిల్ (22) లు ఆదుకోవడంతో విండీస్ ముందు పాక్ 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. 

Scroll to load tweet…

లక్ష్య ఛేదనలో విండీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. షై హోప్ (4) ను షాహీన్ అఫ్రిది ఔట్ చేశాడు. కానీ మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (33), బ్రూక్స్ (42) లు కాసేపు పాక్ బౌలర్లను అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 67 పరుగులు జోడించారు. అయితే బ్రూక్స్ ను నవాజ్ ఎల్బీడబ్ల్యూ గా ఔట్ చేసి విండీస్ పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతడు వరుసగా బ్రాండన్ కింగ్ (0), నికోలస్ పూరన్ (25), పావెల్ (10) లను ఔట్ చేశాడు. ఇక లోయరార్డర్ ను మహ్మద్ వసీం పడగొట్టాడు. అతడికి మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో పాకిస్తాన్.. మూడు వన్డేల సిరీస్ ను 2-0 తో ఆధిక్యంలో నిలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. సిరీస్ లో చివరిదైన మూడో వన్డే.. ముల్తాన్ లో ఆదివారం జరుగుతుంది. గతేడాది డిసెంబర్ లో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో కూడా వెస్టిండీస్ ఓడిన విషయం తెలిసిందే.