ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమే లీగ్ దశ నుండే వెనుదిరగాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం పాక్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో పాక్ సారథి సర్పరాజ్ అహ్మద్ తో పాటు మిగతా ఆటగాళ్లు తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇంకా అవుతూనే వున్నారు. తాజాగా మరోసారి పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన  గురించి మాట్లాడిన మాజీ ఆటగాడు, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ సర్పరాజ్ పై మరోసారి ద్వజమెత్తాడు. 

అసలు ఏ స్థాయి క్రికెట్లో కూడా కెప్టెన్ గా పనికిరాని సర్పరాజ్ ను పాక్ ఏకంగా అంతర్జాతీయ జట్టుకు సారథి చేసిందని అక్తర్ ఎద్దేవా చేశాడు.  అందువల్లే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో పాక్ విఫలమయ్యింది. ఫిచ్ పై తమ కెప్టెన్ కు కనీస అవగాహన లేకపోవడం వల్లే టాస్ గెలిచినా భారత్ చేతిలో ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా అక్తర్ గుర్తుచేశాడు. కాబట్టి ఇప్పటికైనా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించి కెప్టెన్ గా సర్ఫరాజ్ ను తొలగించి యువ ఆటగాళ్లకు జట్టు పగ్గాలు అప్పించాలని  అక్తర్ సూచించాడు. 

అయితే పిసిబి తొలగించే కంటే ముందే సర్పరాజ్ స్వతహాగా కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటే హుందాగా వుంటుందని సూచించాడు. ఇక పరిమిత ఓవర్ల (టీ20,వన్డేలు) విభాగానికి హారిస్ సోహైల్ ను, టెస్టు విభాగానికి బాబర్ ఆజమ్ ను పాకిస్థాన్ సారథులుగా నియమించాలని కోరాడు. ఇలా యువ ఆటగాళ్లు సారథులుగా వుంటేనే పాక్ మంచి ఫలితాలను అందుకుంటుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. 

కెప్టెన్ గా  తప్పుకున్నా సర్ఫరాజ్ మాత్రం జట్టులో కొనసాగాలని కోరాడు. అతడు మంచి బ్యాట్ మెన్ మరియు వికెట్ కీపర్ మాత్రమే...మంచి కెప్టెన్ కాదు. కాబట్టి అతడి బ్యాటింగ్, వికెట్ కీపింగ్ సేవలు పాక్ జట్టుకు అవసమరమంటూ చివర్లో సర్పరాజ్ కు ఊరటనిచ్చేలా అక్తర్ మాట్లాడాడు.