ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే సీరిస్ లో పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా మాజీ లేజెండరీ క్రికెటర్, మొట్టమెదటి వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట వున్న రికార్డును ఇమామ్ బద్దలుగొట్టాడు. ఇలా గత 36 ఏళ్లుగా పదిలంగా వున్న ఈ రికార్డు తాజాగా ఈ పాకిస్థాని ఓపెనర్ ఖాతాలోకి చేరింది.

అతి చిన్న వయసులో 150 పైచిలుకు పరుగులు సాధించిన రికార్డు ఇన్నిరోజులు కపిల్ దేవ్ పేరిట వుండగా దాన్ని ఇమామ్ బద్దలుగొట్టాడు. 1983 వరల్డ్  కప్ సందర్భంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో  24ఏళ్ల కపిల్ 175 పరుగులు బాదాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో అతి చిన్న వయసులో 150 పైచిలుకు పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు నమోదుచేశాడు. 

తాజాగా  ఆ రికార్డు పాకిస్థాన్ ఓపెనర్ ఖాతాలో చేరింది. మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇమామ్ 151 పరుగులు సాధించాడు. అయితే ప్రస్తుతం అతడి వయసు 23 సంవత్సరాలే కావడంతో కపిల్ పేరుతో గత 36ఏళ్లుగా పదిలంగా వున్న ఈ రికార్డు ఇమామ్ ఖాతాలోకి చేరింది. 

ఆతిథ్య ఇంగ్లాండ్ తో మంగళవారం బ్రిస్టాల్ వేదికగా జరిగిన వన్డేలో పాక్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ బౌండరీలతో చెలరేగాడు. పదహారు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో కేవలం 131బంతుల్లోను 151 పరుగులు చేశాడు. దీంతో పాక్ నిర్ణీత ఓవర్లలో పాక్ 358 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. 

అయితే 359 భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టుకు ఓపెనర్లు  మంచి శుభారంభాన్నిచ్చారు. బెయిర్ స్టో చెలరేగి 5 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో కేవలం 93 బంతుల్లోనే 128 పరుగులు చేశాడు. అతడి సూపర్ సెంచరీకి   జాసన్ రాయ్(76 పరుగులు 55 బంతుల్లో) తోడవడంతో ఇంగ్లాండ్ మరో ఐదు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఇమామ్ సెంచరీ బూడిదలో పోసిన పన్నీరయిపోయింది.