Ball Of The Century: దిగ్గజ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరణించి దాదాపు 3 నెలలు కావస్తున్నా క్రికెట్  ప్రపంచం మాత్రం అతడిని ఏదో ఒక  రూపంలో నిత్యం స్మరించుకుంటూనే ఉంది.  ఈరోజుతో వార్న్ కు ప్రత్యేక అనుబంధముంది. 

చరిత్రలో కొన్ని విషయాలు ఎప్పటికీ చెరిగిపోవు. కాలం గడుస్తున్న కొద్దీ అవి మన స్మృతిపథంలో తిరుగుతూనే ఉంటాయి. క్రికెట్ లో ఒక అనామక బౌలర్ గా వచ్చి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ తానెంటో నిరూపించిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం కూడా అంతే. ఈ దిగ్గజ స్పిన్నర్ మరణించి మూడు నెలలు కావస్తున్నా వార్న్ తన కెరీర్ లో విసిరిన బంతులు, పడగొట్టిన వికెట్లు.. ఈ మాయావిని నిత్యం మనం స్మరించుకునేలా చేస్తున్నాయి. ఆ కోవలో ముందు వరుసలో నిలిచేది 1993లో యాషెస్ సిరీస్ లో భాగంగా వార్న్ విసిరిన ‘బాల్ ఆఫ్ ది సెంచరీ...’ ఈ బంతి విసిరి నేటికి 29 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఐసీసీ.. వార్న్ ఆ వికెట్ తీసినప్పటి ఫోటో ను షేర్ చేసి అతడికి నివాళినర్పించింది. 

అది 1993 జూన్ 4, మాంచెస్టర్ లో తొలి టెస్టు.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ పెద్దగా స్కోరేమీ చేయలేదు. 289 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్ అథర్టన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు మైక్ గాటింగ్. స్పిన్ బౌలింగ్ ఆడటంలో అతడు దిట్ట. 

అప్పటికీ వార్న్ ఎంట్రీ ఇచ్చి సంవత్సరమే అవుతుంది. పెద్దగా అనుభవం కూడాలేదు. ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్.. వార్న్ కు బంతినిచ్చాడు. బంతిని అందుకున్న వార్న్.. ఫీల్డింగ్ సెట్ చేసుకుని మణికట్టు నుంచి అస్త్రాన్ని సంధించాడు. ఎక్కడో లెగ్ స్టంప్ ఆవల పడింది బంతి. ఆ ఇదేం చేస్తుందిలే అనే ధీమా గాటింగ్ ది. మహా అయితే స్పిన్అయినా ప్యాడ్ , బ్యాట్ కు తాకుతుందిలే అనుకుని స్టైల్ గా డిఫెన్స్ ఆడాడు. కానీ రెప్పపాటు క్షణంలో.. లెగ్ స్టంప్ కు ఆవల పడ్డ బంతి.. ఏకంగా రెండు అడుగులు స్పిన్ అయి సర్రున లోపలికి దూసుకొచ్చి ఆఫ్ స్టంప్ బెయిల్స్ ను పడగొట్టింది.

YouTube video player

ఆసీస్ వికెట్ కీపర్ ఇయాన్ హీలితో పాటు ఆ జట్టు ఆటగాళ్లంతా సంబురాల్లో ఉన్నారు. కానీ ఇద్దరికి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ఇద్దర్లో ఒకరు గాటింగ్ కాగా.. మరొకరు అంపైర్. లెగ్ స్టంప్ ఆవల పడ్డ బంతి.. ఆఫ్ స్టంప్ బెయిల్స్ ఎలా పడగొట్టిందబ్బా.. అని అతడు తొంగి తొంగి చూశాడు.ఇక గాటింగ్ కు ఒకరకమైన మైకం కమ్మేసింది. అసలు బంతి లోపలికి అలా వచ్చింది రా దేవుడా..? అంటూ బిత్తర చూపులు చూసుకుంటూ పెవిలియన్ కు నడిచాడు. 

Scroll to load tweet…

ఆ బంతిని విసిరినప్పుడు వార్న్ గానీ.. ఔట్ అయినప్పుడు గాటింగ్ గానీ ఈ బాల్.. ఈ శతాబ్దపు బంతి అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. వాళ్లు పట్టించుకోకున్నా చరిత్ర మాత్రం ఆ బంతికి సరైన గౌరవం ఇచ్చింది. వార్న్ వేసిన ఆ బాల్ ను ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ గా చేరుస్తూ ఐసీసీ ప్రకటించింది. ఇప్పటితో మొదలైన ఈ మాంత్రికుడి ప్రస్థానం సుమారు రెండు దశాబ్దాల పాటు అప్రతీహాతంగా కొనసాగింది.