క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. వివిధ హావభావాలతో, చేతలతో ఉద్వేగాలు ప్రదర్శించే కోహ్లీ కనిపించలేదు. అయితే, న్యూజిలాండ్ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో పాత విరాట్ కోహ్లీ నిద్ర లేచాడు. 

 

కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ లపై అతను దురుసుగా ప్రవర్తించాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సు 29వ ఓవరులో జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతి కేన్ విలియమ్సన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. పెవిలియన్ కు దారి తీసిన విలియమ్సన్ కు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సెండాఫ్ ఇచ్చాడు. దాన్ని ఓ క్రికెట్ అభిమాని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

అదే విధంగా టామ్ లాథమ్ విషయంలోనూ జరిగింది. మొహమ్మద్ షమీ బౌలింగులో అవుటైన టామ్ లాథమ్ వెనుదిరిగినప్పుడు కూడా విరాట్ కోహ్లీ దురుసుగా మాట్లాడాడు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

న్యూజిలాండ్ ను 235 పరుగులకు భారత బౌలర్లు ఆలవుట్ చేశారు. దాంతో భారత్ కు 7 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యత లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన భారత్ 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.