Asianet News TeluguAsianet News Telugu

Nz Vs Bng: బదులు తీర్చుకున్న న్యూజిలాండ్.. రెండో టెస్టులో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్

New Zealand Vs Bangladesh:  క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 126 పరుగులకే పెవిలియన్ కు పంపిన కివీస్.. రెండో ఇన్నింగ్సులో 278 పరుగులకు ఆలౌట్ చేసి మూడు  రోజుల్లోనే టెస్టును ముగించింది.

Nz Vs Bng: New Zealand Beat Bangladesh by an Innings and 117 Runs In 2nd Test
Author
Hyderabad, First Published Jan 11, 2022, 12:54 PM IST

తొలి టెస్టులో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ ఘనంగా బదులు తీర్చుకుంది. తమను ఓడించగానే మితిమీరిన సంబురాలు చేసుకున్న బంగ్లాదేశ్ కు కివీస్ అసలు ఆట చూపించింది. ముందు బ్యాటింగ్ లో అదరగొట్టిన న్యూజిలాండ్.. తర్వాత బంగ్లాదేశ్ ను ఫాలో ఆన్ ఆడించి మరీ దెబ్బకొట్టింది.   తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 126 పరుగులకే పెవిలియన్ కు పంపిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్సులో 278 పరుగులకు ఆలౌట్ చేసి మూడు  రోజుల్లోనే టెస్టును ముగించింది. ఫలితంగా  ఇన్నింగ్స్ 117 పరుగులతో ఘన విజయం సాధించింది. అంతకుమందు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 521-6 డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. 

రెండో రోజే బంగ్లాను తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసిన కివీస్.. మూడో రోజు కూడా నిలువనీయలేదు. మూడో రోజు ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించిన కివీస్.. ఆట ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శంచింది.  బంగ్లా ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం (21) , మహ్మద్ నయీం (24) లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.  వన్ డౌన్ లో వచ్చిన నజ్ముల్ హుస్సేన్ (29) కూడా రాణించలేదు. 

 

ఇక ఆతర్వాత వచ్చిన కెప్టెన్  మొమినల్ హక్ (37) తో జతకలిసిన లిటన్ దాస్ (102)  బంగ్లాను ఆదుకున్నాడు.  ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. మొమినల్ నిష్క్రమించిన తర్వాత వికెట్ కీపర్  నురుల్ హసన్ (36)తో జతకలిసిన దాస్.. కెరీర్ లో రెండో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ డారిల్ మిచెల్.. నురుల్ ను ఔట్ చేయడంతో బంగ్లా బ్యాటింగ్ వేగంగా మారింది. ఈ క్రమంలో వన్డే మాదిరి ఆడిన లిటన్ దాస్ కు మరోవైపు సహకారం కరువవడంతో అతడు కూడా  నిష్క్రమించాడు. 

రాస్ టేలర్ కు ‘చివరి’ జ్ఞాపకం : 

 

కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న కివీస్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ కు ఆ జట్టు అరుదైన  జ్ఞాపకం దక్కింది.  బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో.. ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయినప్పుడు టామ్ లాథమ్ రాస్ టేలర్ కు బంతి అందించాడు. ఆ ఓవర్లో మూడో బంతికి ఎబాదత్..  లాథమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో రాస్ టేలర్ తన కెరీర్ ను వికెట్ తో ముగించాడు.  వికెట్ తీసిన వెంటనే సహచర ఆటగాళ్లు టేలర్ ను అభినందించారు.  డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లేప్పుడు టేలర్ ఉద్వేగంగా వెళ్లాడు. 

మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ నాలుగు వికెట్లు తీయగా  నీల్ వాగ్నర్ 3 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మిచెల్, రాస్ టేలర్ కు తలో వికెట్ దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో  ఐదు వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్ కు ఈ ఇన్నింగ్స్ లో వికెట్లేమీ దక్కలేదు. 

రెండో టెస్టు విజయంతో సిరీస్ ను కివీస్ 1-1 తో సమం చేసింది.  తొలి టెస్టులో బంగ్లాదేశ్.. న్యూజిలాండ్ ను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే..  దీంతో రెండో టెస్టులో కసిగా ఆడిన కివీస్.. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ తాత్కాలిక సారథి  టామ్ లాథమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  

Follow Us:
Download App:
  • android
  • ios