Asianet News TeluguAsianet News Telugu

Ross Taylor: కివీస్ లెజెండ్ కు ‘చివరి’ జ్ఞాపకం.. లాస్ట్ టెస్టులో బౌలింగ్.. వికెట్ తో కెరీర్ ముగింపు

New Zealand Vs Bangladesh: సుమారు 16 ఏండ్ల పాటు న్యూజిలాండ్ క్రికెట్ కు సేవలందించిన ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్  రాస్ టేలర్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. బంగ్లాదేశ్ తో ముగిసిన రెండో టెస్టుతో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

NZ VS BNG: In His Final Test, Ross Taylor Bowls Last Over And Takes Wicket, Twitter Reacts
Author
Hyderabad, First Published Jan 11, 2022, 2:30 PM IST

న్యూజిలాండ్ లెజెండ్, ఆ జట్టు వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ సుదీర్ఘ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 2006 నుంచి న్యూజిలాండ్ జట్టుకు సేవలందిస్తున్న   టేలర్.. బంగ్లాదేశ్ తో మంగళవారం ముగిసిన రెండో టెస్టుతో అంతర్జాతీయ  క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 37 ఏండ్ల ఈ లెజెండరీ క్రికెటర్.. ఈ సిరీస్ లో బ్యాట్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా  తన కెరీర్ ను  వికెట్ తో ముగించాడు.  క్రైస్ట్చర్స్ టెస్టులో  బంగ్లాదేశ్ ఆఖరి వికెట్ పడగొట్టింది రాస్ టేలరే కావడం గమనార్హం. 

అప్పటికీ బంగ్లాదేశ్ ఓటమి అంచున ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 126 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు.. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో కూడా చతికిలపడింది. మూడో రోజు.. 79 ఓవర్లు ఆడిన ఆ జట్టు 278 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయిన సందర్బంలో కివీస్ తాత్కాలిక సారథి టామ్ లాథమ్.. రాస్ టేలర్ చేతికి బంతిని అందించాడు. 

 

తన కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న టేలర్.. 79వ ఓవర్లో బౌలింగ్ కు రాగానే స్టేడియంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.   గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు చప్పట్లతో రాస్ టేలర్ ను ఉత్సాహపరిచారు. బంతిని అందుకున్న టేలర్.. తొలి బంతికి ఎబాదత్ ను ఎల్బీడబ్ల్యూ చేసినంత పని చేశాడు. కానీ తృటిలో అది మిస్ అయింది. రెండో బంతికి  కూడా పరుగులేమీ రాలేదు. ఇక మూడో బంతిని ఎబాదత్ పైకి లేపాడు.  అది కాస్తా  ఫ్రంట్ లో  ఫీల్డింగ్ చేస్తున్న లాథమ్ చేతిలో పడింది. అంతే.. న్యూజిలాండ్ ఆటగాళ్లు టేలర్ ను  అభినందనలతో ముంచెత్తారు. చివరి టెస్టు ఆడుతున్న టేలర్ కు అలా ‘చివరి జ్ఞాపకం’ వికెట్ రూపంలో మిగిలింది. 

ఇదిలాఉండగా..  ఈ టెస్టు ప్రారంభం సమయంలో కివీస్  జాతీయ గీతం ఆలపిస్తుండగా  రాస్ టేలర్ భావోద్వేగానికి లోనయ్యాడు. మైక్ లో  జాతీయ గీతం వస్తుండగా టేలర్ కండ్లలో నీళ్లు తిరిగాయి.  అది ముగియగానే అతడు ఉద్వేగానికి లోనయ్యాడు.  ఈ సమయంలో అతడి భార్య, పిల్లలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 

 

2006లో న్యూజిలాండ్ తరఫున తొలి వన్డే ఆడిన రాస్ టేలర్..  112 టెస్టులలో 7,683 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 290.  233 వన్డేలు ఆడిన  ఈ లెజెండరీ క్రికెటర్.. 8,581 పరుగులు చేశాడు. వన్డేలలో 48.20 సగటుతో 21 సెంచరీలు, 51 అర్థ శతకాలు సాధించాడు. ఇక న్యూజిలాండ్ తరఫున 102 టీ20లు ఆడి 1,909 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలున్నాయి. 

ఇక రెండో టెస్టులో కివీస్..  బంగ్లాపై 117 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 521-6  పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 126 పరుగులకు, రెండో ఇన్నింగ్సులో 278 రన్స్ కు ఆలౌట్ అయింది.  టామ్ లాథమ్ కు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  అవార్డు దక్కగా.. డెవాన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.   

Follow Us:
Download App:
  • android
  • ios