Asianet News TeluguAsianet News Telugu

NZ Vs BNG: ఫోర్ కొట్టలేదు.. సిక్సర్ బాదలేదు.. కానీ ఒక బంతికి ఏడు పరుగులు.. బంగ్లా ఫీల్డర్లంటే అంతే మరి..

New Zealand Vs Bangladesh:  బౌలర్ బంతి విసిరాడు. అది కాస్తా బ్యాట్ కు తాకి స్లిప్స్ లో ఫీల్డర్ వద్దకు వెళ్లింది.. కానీ బ్యాటర్లిద్దరూ ఏకంగా ఏడు పరుగులు తీశారు. 

Nz Vs Bng: Bangladesh concede seven runs off one ball after Liton Das drops Will Young in the slips, Video goes Viral
Author
Hyderabad, First Published Jan 9, 2022, 11:39 AM IST

క్రీజులో ఉన్న బ్యాటర్ ఫోర్ కొట్టలేదు. సిక్సర్ కోసం ట్రై అయినా చేయలేదు. కనీసం బంతిని గట్టిగా కూడా బాదలేదు. కానీ కివీస్ కు మాత్రం ఒక బంతికి ఏడు పరుగులొచ్చాయి. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఆ బాల్ కు క్యాచ్ మిస్ కూడా అయింది. అదెలా అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా ఫీల్డర్ల నిర్వాకానికి కివీస్ ఆటగాళ్లు పరుగులు భారీగా పిండుకున్నారు. తొలి టెస్టులో ఓటమి ఇచ్చిన అవమాన భారమో  ఏమో గానీ  న్యూజిలాండ్ బ్యాటర్లు.. టెస్టును వన్డే మాదిరి మార్చేశారు. ఒకరిని మించి ఒకరు పరుగులు సాధించారు. 

తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించిన  ఎబాదత్ హుస్సేన్.. ఈ మ్యాచులో 25వ ఓవర్  బౌలింగ్ చేశాడు.  అప్పటికీ న్యూజిలాండ్  92 పరుగులతో వికెట్ నష్టపోకుండా ధాటిగా ఆడుతున్నది.  25వ ఓవర్ లో ఎబాదత్ ఆఖరు బంతి విసరగా.. అది  కివీస్ బ్యాటర్ విల్ యంగ్ బ్యాట్ ను ముద్దాడుతూ స్లిప్స్ లో ఉన్న లిటన్ దాస్ దిశగా వెళ్లింది. 

 

కానీ సెకండ్ స్లిప్స్ లో ఉన్న లిటన్ దాస్ ఆ క్యాచ్ ను డ్రాప్ చేశాడు. క్యాచ్ ను పట్టే క్రమంలో అతడు విఫలం కావడంతో బంతి కాస్తా.. థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ బంతిని కీపర్ కు విసిరాడు. అప్పటికే విల్ యంగ్-టామ్ లాథమ్ లు మూడు పరుగులు తీశారు. 

కాగా  బంతిని అందుకున్న  కీపర్ నురుల్ హసన్.. బౌలర్ వైపునకు బంతిని బలంగా విసిరాడు. అది కాస్తా ఎబాదత్ ను దాటుకుంటూ వెళ్లింది. దీంతో మళ్లీ బౌలరే బాల్ వెంట పరుగెత్తాల్సి వచ్చింది. అయినా బాల్ మాత్రం వెళ్లి బౌండరీ దగ్గర ఆగింది. ఒకే బంతికే ఏడు పరుగులు వచ్చాయి. దీంతో బంగ్లా ఆటగాళ్లతో పాటు కివీస్ బ్యాటర్లు, కామెంటేటర్లు  ఆశ్చర్యంతో పాటు  బంగ్లా ఫీల్డర్ల నిస్సహాతను చూసి నవ్వుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

డబుల్ సెంచరీ దిశగా టామ్ లాథమ్ : 

 

ఇదిలాఉండగా..  తొలి టెస్టులో బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓడిన న్యూజిలాండ్ రెండో టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న ఆఖరు టెస్టులో  తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో  ఒక వికెట్ కోల్పోయి 349 పరుగులు చేసింది. ఆ జట్టు  తాత్కాలిక సారథి టామ్ లాథమ్ (186 నాటౌట్), విల్ యంగ్ (54) డెవాన్ కాన్వే (99 నాటౌట్)  దుమ్మురేపే ప్రదర్శన చేశారు. తొలి  వికెట్ కు 148 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్ యంగ్.. షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్ లో నిష్క్రమించగా..  అనంతరం వచ్చిన కాన్వేతో  జతకలిసిన  లాథమ్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ప్రస్తుతం అతడు మరో 14 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ సాధిస్తాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios