తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో అవుటైన తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో సీరియస్‌గా చర్చించిన విరాట్ కోహ్లీ... ఆ సమయంలో ఫుడ్ రావడంతో చప్పట్లు కొడుతున్న వీడియో వైరల్ కావడంతో...

ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు అభిమానులు. సొంత మైదానంలో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి, మూడేళ్ల టెస్టు సెంచరీ బ్రేక్‌ని బ్రేక్ చేస్తాడని బోలేడు ఆశలతో స్టేడియానికి తరలి వచ్చారు అభిమానులు. అయితే వారి ఆశ నెరవేరలేదు.. రెండో టెస్టులో సెంచరీ కాదు కదా, కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ...

తొలి ఇన్నింగ్స్‌లో 84 బంతులు ఆడి 4 ఫోర్లతో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, తొలి టెస్టు ఆడుతున్న మాథ్యూ కుహ్నేమన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. బంతి బ్యాటుకి, ప్యాడ్స్‌కి ఒకేసారి తగులుతున్నట్టు కనిపించడంతో విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో వివాదం కూడా రేగింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్‌కి, ప్యాడ్స్‌కి ఒకేసారి తగులుతున్నట్టు కనిపిస్తే.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ప్రాధాన్యం ఇచ్చిన థర్డ్ అంపైర్, బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించడంతో ‘అంపైర్స్ కాల్’గా ప్రకటించాడు...

ఈ నిర్ణయం తర్వాత డగౌట్‌లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కూర్చొని చాలాసేపు మాట్లాడాడు విరాట్ కోహ్లీ. ‘బంతి క్లియర్‌గా బ్యాటును తగులుతున్నట్టు కనిపించింది. నాటౌట్ ఇవ్వాలిగా..’ అని రాహుల్ ద్రావిడ్‌తో సీరియస్‌గా డిస్కర్షన్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి, ఏదో ఫుడ్ పార్శిలు తీసుకుని రావడం.. ‘విరాట్ సర్’ అని పిలవగానే కోహ్లీ, చప్పట్లు కొట్టి ‘అక్కడ పెట్టు వస్తున్నా’ అని సైగలు చేయడం కనిపించింది..

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. విరాట్ కోహ్లీ ఫుడ్‌ని చూడగానే అంత సంతోషించాడంటే అందులో ఉన్నది అతని ఫెవరెట్ ‘ఛోలే బటురే’ అనుకున్నారు అభిమానులు. తాజాగా రెండో టెస్టు ముగిసిన తర్వాత ఓ మీడియా ప్రతినిధి, ఇదే విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ని అడిగాడు...

‘కాదు.. కాదు అది ఛోలే బటురే కాదు.. కుల్చా చోలే. అది రాగానే పక్కనే ఉన్న నన్ను కూడా తిందాం రమ్మని పిలిచాడు. దాని టేస్ట్ గురించి చెప్పి ఊరించాడు. అయితే నాకు ఇప్పటికే 50 ఏళ్లు వచ్చేశాయి. ఇప్పుడు అంత కొలేస్ట్రాల్‌ని నేను తట్టుకోలేను... అని చెప్పేశా. అతను నన్ను ఊరిస్తూ తిన్నాడు...’ అంటూ చెప్పి నవ్వేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

డైట్ విషయంలో ఎంతో పక్కగా ఉండే విరాట్ కోహ్లీ, తనకి ఇష్టమైన చోలే బటురే, కుల్చా చోలేల విషయంలో మాత్రం ఓ పట్టు పట్టేస్తాడు. దానికి తగ్గట్టుగా తన రెగ్యూలర్ వ్యాయామాల్లో మార్పులు చేసుకుంటాడట విరాట్ కోహ్లీ...

తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్ ఆడేందుకు వచ్చిన విరాట్ కోహ్లీ, స్టంపౌట్ అయ్యాడు. టెస్టు కెరీర్‌లో విరాట్ కోహ్లీ స్టంపౌట్ కావడం ఇదే తొలిసారి...