Srilanka Tour Of India: భారత మాజీ సారథి విరాట్ కోహ్లి స్వస్థలం ఢిల్లీ. కానీ కోహ్లికి బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. గత 14 ఐపీఎల్ సీజన్లుగా అతడు ఇక్కడే ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. త్వరలో శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్టుతో అతడు...
దక్షిణ భారత రాష్ట్రం కర్నాటక రాజధాని బెంగళూరుకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లికి ప్రత్యేక అనుబంధం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కోహ్లికి సొంత గ్రౌండ్ వంటిది. కోహ్లి స్వస్థలం ఢిల్లీ అయినా ఐపీఎల్ లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ నుంచి బెంగళూరుతోనే ఉంటున్న కోహ్లికి చిన్నస్వామి స్టేడియమన్నా ఇక్కడి ప్రజలన్నా ఎంతో అభిమానం. అలాంటి కోహ్లి త్వరలోనే తన కెరీర్ లో ఇక్కడ వందో టెస్టు ఆడతాడని అంతా భావించారు. తమ అభిమాన ఆటగాడికి దీనిని మరుపురాని టెస్టుగా చేయడానికి బెంగళూరు అభిమానులు వేయికండ్లతో వేచి చూస్తున్న వేళ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వాళ్లకు షాకిచ్చింది.
త్వరలోనే శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా లంకేయులు.. భారత్ తో రెండు టెస్టులు, మూడు టీ20 లు ఆడాల్సి ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25న బెంగళూరు లో తొలి టెస్టు జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటికే 99 టెస్టులాడిన కోహ్లి.. తన సొంతగ్రౌండ్ లోనే వందోటెస్టు ఆడతాడని అంతా భావించారు.
కానీ బీసీసీఐ మాత్రం బెంగళూరు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. పర్యటనలో మార్పులు చేసింది. ముందుగా టీ20 సిరీస్ ను.. తర్వాత టెస్టు సిరీస్ ను నిర్వహించేందుకు సిద్ధమైంది.
కొత్త షెడ్యూల్ ఇదే..?
తాజా షెడ్యూల్ ప్రకారం.. శ్రీలంక జట్టు లక్నోలో ఫిబ్రవరి 24న జరుగబోయే టీ20 సిరీస్ తో పర్యటన ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 26, 27న ధర్మశాలలో రెండు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది. టీ20 లు ముగిశాక ఇరు జట్లు నేరుగా మొహాలీ (పంజాబ్) కు బయల్దేరతాయి. అక్కడ మార్చి 3-7 మధ్య భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగనుంది. అదే కోహ్లి వందో టెస్టు కానుంది. ఇక ఆ తర్వాత మార్చి 12-16 మధ్య రెండో టెస్టు బెంగళూరు వేదికగా జరుగుతుందని ‘క్రిక్ బజ్’ నివేదిక పేర్కొంది. టీ20 సిరీస్ కు సంబంధించి ఇప్పటకే ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు ఆదేశాలు కూడా అందినట్టు తెలుస్తున్నది.
రెండు జట్లకూ ఉపయోగకరమే..
చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప ఇక ఇదే ఫైనల్ అని ఓ బోర్డు ప్రతినిధి కూడా తెలిపాడు. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ముగించుకుని నేరుగా భారత్ కు వచ్చే శ్రీలంక.. ఈ పర్యటనలో మార్పులు చేయాలని బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. అప్పటికే బయో బబుల్స్ లో ఉన్న జట్టునే భారత్ తో కొనసాగించడానికి తమకు వీలుగా ఉంటుందని, అలా కాక టెస్టు సిరీస్ ముందుగా ఆడితే తాము మొత్తం జట్టును మార్చాల్సి ఉంటుందని కోరింది. ఈ విన్నపాన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంది. భారత్ కు కూడా ఇది అనుకూలించేదే. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడుతున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 16 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో టీ20 సిరీస్ ఆడుతుంది. ఈనెల 20 న అది ముగుస్తుంది. దీంతో అదే జట్టును లక్నో కు పంపిస్తే సరిపోతుందని బీసీసీఐ భావిస్తుంది.
