వార్మప్ మ్యాచ్‌లను విడువని వరుణుడు... ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచ్‌తో పాటు ఆ మ్యాచ్‌కి కూడా...
వర్షం కారణంగా ఇప్పటికే ఫలితం తేలకుండా రద్దు అయిన మూడు వార్మప్ మ్యాచులు.. ఇండియా - నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్‌నీ వదలని వరుణుడు..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. అయితే ఇండియాలో చాలా చోట్ల ఇంకా వానలు కురుస్తుండడంతో ఈ మెగా టోర్నీ సజావుగా మొదలుకావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వార్మప్ మ్యాచుల్లో ఇప్పటివరకూ 3 మ్యాచులు వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కాగా ఆఖరి రోజు వార్మప్ మ్యాచులను కూడా వరుణుడు వదల్లేదు..
తిరువనంతపురంలో ఇండియా- నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత నాలుగు రోజులుగా తిరువనంతపురంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంతకుముందు ఇక్కడ జరగాల్సిన శ్రీలంక- ఆఫ్ఘాన్ వార్మప్ మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే రద్దు అయ్యింది.
ఆస్ట్రేలియా - నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ని 23 ఓవర్లకు కుదించి నిర్వహించాలని ప్రయత్నించినా, రెయిన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఫలితం తేలకుండానే రద్దు చేయాల్సి వచ్చింది.
అలాగే గౌహతిలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. గౌహతిలో ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయ్యింది..
అయితే నిన్న బంగ్లాదేశ్- ఇంగ్లాండ్ మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్ మాత్రం రిజల్ట్ వచ్చింది. వర్షం అంతరాయం కలిగించినా 37 ఓవర్లకు కుదించి నిర్వహించిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది..
హైదరాబాద్‌లో జరుగుతున్న పాకిస్తాన్- ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లో బుధవారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నా, ఉప్పల్ ఏరియాలో వాన రాకపోతే మ్యాచ్ రిజల్ట్ వచ్చేస్తుంది.