భారత్- ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు సమయం లేదు. క్రికెట్ ప్రియులంతా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తమ జట్టుకి వార్నింగ్ ఇచ్చారు. స్లెడ్జింగ్‌ పేరిట హద్దులు దాటి ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. మ్యాచ్‌ మధ్యలో సరదా సంభాషణలకు చోటు ఉంటుందని, పోటీతత్వంతో ముందుకు సాగాలే తప్ప అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు.

‘గత రెండేళ్లుగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో మీరు గమనించవచ్చు. మైదానం లోపల, వెలుపల మా ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా సరదా సంభాషణలకు, పరిహాసాలకు చోటు ఉంటుందేమో గానీ, అసభ్య దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని చెప్పుకొచ్చాడు.

2018-19 నాటి భారత పర్యటనలో ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పెన్‌- టీమిండియా సారథి కోహ్లి మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కోహ్లి వ్యవహారశైలిని మేమెంతగానో ప్రేమిస్తాం. 

అందులో హాస్య చతురతే తప్ప, అంతగా తప్పుబట్టాల్సిన విషయమేదీ లేదు. నిజానికి ఆసీస్‌- ఇండియా సిరీస్‌ అంటే ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో మజాను పంచుతుంది. ఆర్థికంగా కూడా టీమిండియా టూర్‌ ఇప్పుడు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఎంతగానో అవసరం’’ అని పేర్కొన్నాడు