హామిల్టన్: యువ సంచలనం శుభ్ మన్ గిల్ ఇండియా తరఫున తొలి టెస్టు ఆడడానికి ఆశ పడుతున్నాడు. అయితే అతను మాజీ ఓపెనింగ్ జతగాడు పృథ్వీ షా నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నాడు. వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ పై ప్రారంభమయ్యే టెస్టు మ్యాచులో రెండో ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ కు అవకాశం దక్కుతుందా, పృథ్వీ షా దాన్ని కొల్లగొడుతాడా అనే చర్చ సాగుతోంది. మయాంక్ అగర్వాల్ తో పాటు ఈ ఇద్దరిలో ఎవరు ఇన్నింగ్సును ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ స్థితిలో శుభ్ మన్ గిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మయాంక్ అగర్వాల్ కు జోడీగా ఎవరిని పంపిస్తారనేది టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని శుభ్ మన్ గిల్ అన్నాడు. తనకు పృథ్వీ షాతో ఏ విధమైన పోటీ లేదని, ఇద్దరిలో ఎవరం ఆడినా జట్టు కోసం ఆడుతామని చెప్పాడు.

ఒకరితో మరొకరం పోటీ పడేందుకు ఇక్కడికి రాలేదని, వచ్చిన అవకాశాలన్ని వాడుకోవడం కోసం వచ్చామని, తుది జట్టులో ఎవరు ఉండాలనేది తమ సమస్య కాదని, అది మేనేజ్ మెంట్ తలనొప్పి అని ఆయన అన్నాడు. తమ ఇద్దరి కెరీర్ ఒకేసారి ప్రారంభమై ఉండవచ్చు గానీ ఆ కారణంగా తమ మధ్య పోరు అనేది ఎప్పుడూ లేదని, ఇక ముందు కూడా ఉండదని స్పష్టం చేశాడు. 

తమ స్థానాల్లో మెరుగైన ప్రదర్శన చేయడం వల్లనే ఇక్కడి దాకా వచ్చామని, భారత సీనియర్ జట్టు తరపున ఎవరు ఆడుతారనేది మేనేజ్ మెంట్ చూసుకుంటుందని చెప్పాడు. ఎవరికి అవకాశం వచ్చినా దాన్ని వృధా చేసుకోకుండా ఆడడమే తమ లక్ష్యమని అన్నాడు. 

టీ20 సిరీస్ లో నిరాశపరిచినప్పటికీ టెస్టు ల్లో మయాంక్ అగర్వాల్ కు తప్పకుండా తుది జట్టులో స్థానం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ స్థితిలో పృథ్వీ షా, గిల్ ఇద్దరిలో ఒకరు రిజర్వ్ బెంచీకి పరిమితం కావాల్సి వస్తుంది.