టీమిండియా పుష్ఫరాజ్ వైల్డ్ ఫైర్ : 'నియవ్వ తగ్గేదేలే' అంటున్న నితీష్ రెడ్డి

బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా ఆల్ రౌండర్, తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. పుష్ప స్టైల్లో నియవ్వ తగ్గేదేలే అనేలా హాఫ్ సెంచరీ సాధించిన అతడు సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.

Nitish Kumar Reddy Pushpa style Celebration on reaching first test fifty in Boxing test against Australia AKP

Nitish Kumar Reddy : ఆస్ట్రేలియా గడ్డపై మన తెలుగోడు సత్తా చాటుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా  మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. టీమిండియా  ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడితే నితీష్ రెడ్డి మాత్రం ఇప్పటికే హాఫ్ సెంచరీతో అదరగొట్టి సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు.దీంతో మరోసారి మన తెలుగోడి పేరు క్రీడా ప్రపంచంలో మారుమోగిపోతోంది. 

గత మూడు టెస్టుల్లో 41,38(నాటౌట్),42,42,16  స్కోరు సాధించాడు. ఇలా మూడునాలుగు సార్లు హాప్ సెంచరీ మిస్సయ్యాడు. దీంతో ఈసారి ఎలాగైనా మంచిస్కోరు సాధించాలని పట్టుదలతో ఆడుతున్న నితీష్ హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియాకు ఫాలో ఆన్ తప్పదన్న సమయంలో బ్యాటింగ్ కు దిగిన నితీష్  ఆదుకున్నాడు. 

నితీష్ బ్యాటింగ్ సాగుతోందిలా : 

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు ముగిసాయి. ఇందులో ఓ మ్యాచ్ డ్రా కాగా టీమిండియా-ఆసిస్ చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా నిలిచాయి. దీంతో మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రిజల్ట్ సీరిస్ విజయంలో కీలకం కానుంది. కాబట్టి ఇరుజట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో వున్నాయి. 

అయితే నాలుగో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్టి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. స్టివ్ స్మిత్ అద్భుత సెంచరీ (140 పరుగులు)కి  కొంటాస్ 60, ఖవాజా 57, లబుషనే 72, కెప్టెన్ కమిన్స్ 49 పరుగులు తోడవడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది. 

474 పరుగుల చేధనకు బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 3 పరుగులకే ఔటయినా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన ఆటగాళ్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా కష్టాల్లో పడింది. 164 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 

ఇవాళ(శనివారం) ఓవర్ నైట్ స్కోర్ 164 తో మూడో రోజు ఆట ప్రారంభంకాగానే రిషబ్ పంత్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆపద్భాందవుడిలా క్రీజులోకి ఎంటరయ్యాడు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. వాషింగ్టన్ సుందర్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ ఫాలోఆన్ ముప్పునుండి జట్టును బైటపడేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

నితీష్ బ్యాటింగ్ కు వచ్చే సమయానికి పరిస్థితి చేయిదాటిపోయింది... ఫాలో ఆన్ తప్పదని అందరూ భావించారు. కానీ దిగ్గజ ఆటగాళ్లు తడబడిన పిచ్ పై నితీష్ అద్భుతమే చేసాడు. ఆచితూచి ఆడుతూ మెల్లిగా ఒక్కో పరుగు సాధించాడు... వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాదాడు. ఇలా క్రీజులో కుదురుకున్నాక తన బ్యాటుకు పని చెప్పాడు.  మిచెల్ స్టార్క్ వేసిన 83వ ఓవర్లో ఓ చక్కటి బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

 

మనోడు టీమిండియా పుష్ఫరాజ్ : 

తన టెస్ట్ కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన నితీష్ రెడ్డి సరికొత్తగా సంబరాలు చేసుకున్నాడు. ఇటీవల యావత్ భారతదేశాన్ని షేక్ చేసిన తెలుగు మూవీని ప్రపంచానికి పరిచయం చేసాడు. ఆ  సినిమాల్లో అల్లు అర్జున్ స్టైల్లో తగ్గేదేలే అనేలా బ్యాటుతో ఫోజిచ్చాడు. బ్యాటుతో గడ్డాన్ని నిమురుతున్నట్లు అతడు ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

మన తెలుగోడు టీమిండియా కష్టకాలంలో వుండగా అద్భుతంగా బ్యాటింగ్ తో ఆదుకోవడం చూసి మురిసిపోతున్నారు తెలుగు ప్రజలు. అలాంటిది నితీష్ హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా గడ్డపై పుష్ఫ స్టైల్లో సంబరాలు చేసుకోవడం మనోళ్లను మరింతగా ఆకట్టుకుంది. దీంతో 'నితీష్ అంటే ఫైర్ అనుకుంటివా... వైల్డ్ ఫైర్' అంటూ అతడి సూపర్ ఇన్నింగ్స్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని సెంచరీ వైపు దూసుకుపోతోన్న సమయంలో వర్షం అడ్డుపడింది. టీమిండియా స్కోర్326/7 వద్ద వుండగా వర్షం స్టార్ట్ కావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ సమయంలో నితీష్ కుమార్ 85 పరుగులతో సెంచరీకి చేరువలో, వాషింగ్టన్ సుందర్ 40 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువలో వున్నారు. 

 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios