న్యూజిలాండ్ పై నేడు జరిగే తొలి వన్డేలో భారత్ స్టార్స్ లేకుండా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లేని ఈ మ్యాచులో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వంటి యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది.
లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో భారత్ విజయాల్లో ముఖ్య భూమిక వహించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు న్యూజిలాండ్ వన్డేలకు దూరమయ్యారు. ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా నేడు హామిల్టన్‌లో కొత్త జంటతో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్లు గా తామేమిటో నిరూపించుకున్న పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు నేడు తొలి వన్డేలో జంటగా బరిలోకి దిగనున్నారు. 1974లో ఇంగ్లాండ్‌పై సునీల్ గవాస్కర్, సుధీర్ నాయక్ జోడీ, 2016లో జింబాబ్వేపై కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్ జంట, 1976లో దిలీప్ వెంగ్‌సర్కార్, పి శర్మలు ఓపెనర్లుగా ఒకే మ్యాచ్‌లో అరంగ్రేటం చేశారు. ఈ జాబితాలోకి పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ చేరనున్నారు.
కెఎల్ రాహుల్ రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నప్పటికీ భారత్ ఇద్దరు కొత్త ఓపెనర్లవైపే మొగ్గుచూపుతోంది. వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో కుదురుకునేందుకు కోహ్లిసేన తగిన సమయం ఇవ్వాలని భావిస్తోంది. టెస్టుల్లో ఓపెనర్లుగా సత్తా చాటిన షా, అగర్వాల్‌లు వన్డేల్లోనూ ఆ మార్క్ చూపించాలని ఎదురుచూస్తున్నారు.
భారత టీంలో రోహిత్ శర్మ లేడు. అటు కివీస్ జట్టు వైపు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఇరు శిబిరాలు సూపర్ స్టార్స్‌ను కోల్పోయినా.. హామిల్టన్ వన్డే వన్నె ఏమాత్రం తగ్గటం లేదు.
ప్రతిభావంతులైన ఇద్దరు యువ బ్యాట్స్‌మెన్ భారత్ నుంచి ఆరంగ్రేటం చేయనుండగా, మంచి ఫామ్ చాటుకున్న యువ క్రికెటర్ కెప్టెన్ కేన్ స్థానంలో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
ప్రతి మ్యాచ్ కూడా ఒక సినిమా క్లైమాక్స్ ని తలపిస్తూ, ఊహించని మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించిన టీ20 సమరం తరహాలోనే వన్డే సిరీస్ కూడా సాగనుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
వన్డే సవాల్‌కు భారత్, న్యూజిలాండ్ లు రంకెలేస్తూ సై అంటున్నాయి. టీం ఇండియా మరో సిరీస్‌పై కన్నేసిన వేళ, భారత జట్టును నిలువరించేందుకు ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ఏం చేయనుందో చూడాలి.
