ఎడతెరిపిలేని వర్షం.. న్యూజిలాండ్-అఫ్గాన్ మ్యాచ్‌ను అడ్డుకున్న వరుణుడు.. టాస్ కూడా పడకుండానే రద్దు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో వరుణుడు పెద్ద జట్లకు భారీ షాకులిస్తున్నాడు. వర్షం కారణంగా ఇప్పటికే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ బాధితులుగా మారగా ఇప్పుడు ఆ జాబితాలోకి కివీస్ కూడా చేరింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో వర్షం అగ్రశ్రేణి జట్లకు ఊహించని షాకులిస్తున్నది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కొట్టడం వల్ల ఫలితాలు తేడా వస్తుండగా.. ఒక్క బంతి కూడా పడకుండానే పలు మ్యాచ్ లు రద్దవుతున్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్ వేటలో ఉన్న పెద్ద జట్లకు భారీ షాకులు తగులుతున్నాయి. ఈ జాబితాలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో పాటు ఇప్పుడు న్యూజిలాండ్ కూడా చేరింది. మెల్‌బోర్న్ వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ - అఫ్గానిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
గ్రూప్-1లో భాగంగా ఉన్న న్యూజిలాండ్.. అఫ్గానిస్తాన్ లు నేడు ప్రపంచకప్ లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఇంగ్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఈ మ్యాచ్ పై పూర్తిగా నీళ్లు చల్లాడు. ఒక్క బంతి.. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా అప్పటికీ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో వర్షం కురుస్తూనే ఉంది. గంటన్నర వరకూ వేచి చూసిన అంపైర్లు.. మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్.. తమ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ను 89 పరుగుల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. నేడు అఫ్గాన్ తో కూడా గెలిచి సెమీస్ లో ముందంజ వేయాలని భావించింది. కానీ కివీస్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
ఇక అఫ్గానిస్తాన్ ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ను ఇంగ్లాండ్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆడి 5 వికెట్ల తేడాతో గెలిచింది. అఫ్గాన్ కు తొలి మ్యాచ్ లోనే ఓటమి తప్పలేదు. నేటి మ్యాచ్ లో పుంజుకోవాలని చూసిన ఆ జట్టుకు వరుణుడు అడ్డుతగిలాడు. అయితే ఈ మ్యాచ్ రద్దవడం వల్ల అఫ్గాన్ కంటే కివీస్ కే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశముంది. పాయింట్ల పట్టికలో ఏదైనా తేడా కొడితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి.
ప్రపంచకప్ లో వర్షం కారణంగా మ్యాచ్ లకు అంతరాయం కలుగుతూనే ఉంది. తొలుత జింబాబ్వే - సౌతాఫ్రికా మ్యాచ్ ను వరుణుడు ముంచెత్తాడు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గురువారం మెల్‌బోర్న్ లోనే ఇంగ్లాండ్ - ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగగా.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం పడటంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో రెండు ఓవర్ల మ్యాచ్ జరిగినా ఈ మ్యాచ్ లో ఫలితం మరో విధంగా ఉండేది. తాజాగా న్యూజిలాండ్ - అఫ్గాన్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దవడం గమనార్హం.