Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్, అతని భాగస్వామి సారా రహీమ్ దంపతులకు ఓ పాప జన్మించింది. ఈ విషయాన్నికేన్ విలియమ్సన్ బుధవారం సోషల్ మీడియా వేదిక‌గా తెలుపుతూ ఫొటోల‌ను అభిమానులతో పంచుకున్నాడు. 

Kane Williamson, Partner Sarah Raheem: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ మరోసారి తండ్రి అయ్యారు. విలియమ్సన్, అతని భాగస్వామి సారా రహీమ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. తన భాగస్వామితో కలిసి తన నవజాత కుమార్తెను ఎత్తుకున్న ఆనందక్ష‌ణాల ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పాప‌తో క‌లిపి విలియ‌మ్స‌న్ దంప‌తుల‌కు మూడో సంతానం. ఇప్ప‌టికే వారికి ఒక బాబు, పాప ఉన్నారు. "ఈ ప్ర‌పంచానికి స్వాగతం అందమైన పాపాయి.. నీవు సురక్షితంగా వచ్చినందుకు.. రాబోయే ఉత్తేజకరమైన ప్రయాణానికి చాలా కృతజ్ఞతలు" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రకటన తర్వాత విలియ‌మ్స‌న్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

View post on Instagram

కాగా, విలియమ్సన్, అతని భాగస్వామి సారా రహీమ్ జంటకు గతంలో 2019 లో మ్యాగీ అనే కుమార్తె జన్మించింది. అలాగే, మే 2022 లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. బ్రిస్టల్ కు చెందిన సారా రహీమ్ న‌ర్సుగా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో 2015లో విలియమ్సన్ ఆసుపత్రిలో చికిత్స పొంద‌డానికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే వారు ప్రేమ‌లో ప‌డ్డారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నప్పటికీ రహీమ్ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విలియమ్సన్ తరచూ తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

కేన్ మామ సెంచ‌రీల రికార్డు.. 

ఈ నెల ప్రారంభంలో హామిల్టన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో సెంచ‌రీ కొట్టి కేన్ విలియమ్సన్ అత్యంత వేగంగా 32 టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విలియమ్సన్ 203 బంతుల్లో 11 బౌండరీలు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. అజేయంగా 133 పరుగులు చేసి రెండో టెస్టులో జట్టును ఏడు వికెట్ల తేడాతో గెలిపించాడు.