ENG vs NZ 1st Test: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు  నిలకడగా ఆడిన  కివీస్.. మూడో రోజు మళ్లీ తడబడింది. ఓవర్ నైట్ స్కోరుకు 45 పరుగులే జోడించి ఆలౌటైంది. 

లార్డ్స్ లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు లో ఫలితం తేలేందుకు మరో రెండు రోజులు మిగిలున్నాయి. అయితే ఇంగ్లాండ్ ఛేదించాల్సిన లక్ష్యం మాత్రం టెంప్టింగ్ గా ఉంది. ఆట రెండో రోజు మొదట్లో తడబడినా తర్వాత నిలకడగా ఆడిన కివీస్.. మూడో రోజు నిన్నటి ఆటకు 45 పరుగులు జోడించి కుప్పకూలింది. శుక్రవారం ఆట ముగిసేసమయానికి 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసిన కివీస్.. శనివారం 285 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 277 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు. 

ఓవర్ నైట్ స్కోరు 236 వద్ద మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. నిన్నటి ఆటలో సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిన డారిల్ మిచెల్ (108) బ్రాడ్ వేసిన 79వ ఓవర్లో 3 పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

కానీ బ్రాడ్ వేసిన 84 వ ఓవర్లో ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి స్థానంలో వచ్చిన గ్రాండ్ హోమ్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే బ్రాడ్.. జెమీసన్ కు బౌల్డ్ చేశాడు. తద్వారా ఇంగ్లాండ్ కు టీమ్ హ్యాట్రిక్ లభించింది. 

Scroll to load tweet…

ఇక 87వ ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్ లో.. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిన బ్లండెల్ (96) ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. చివరికి సౌథీ (21), అజాజ్ పటేల్ (4) కూడా ఔట్ కావడంతో న్యూజిలాండ్.. 285 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 277 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, మాథ్యూ పాట్స్ తలో 3 వికెట్లు తీయగా... అండర్సన్ 2, పార్కిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్.. ధాటిగా ఆడిన ఓపెనర్ అలెక్స్ లీస్ (32 బంతుల్లో 20.. 4 ఫోర్లు) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. జాక్ క్రాలే (9 నాటౌట్), ఒలి పోప్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. 1 వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి మరో 246 పరుగులు కావాల్సి ఉంది. 

సంక్షిప్త స్కోరు : 
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 132 ఆలౌట్ 
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 141 ఆలౌట్ 
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 285 ఆలౌట్ 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 31-1 (9 ఓవర్లు ముగిసేసరికి)