37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన రాస్ టేలర్... న్యూజిలాండ్ తరుపున అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా గుర్తింపు...

న్యూజిలాండ్ సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల రాస్ టేలర్, ఇప్పటికీ టెస్టుల్లో రెగ్యూలర్ ప్లేయర్‌గా పరుగులు సాధిస్తూ, న్యూజిలాండ్ జట్టు తరుపున మ్యాచులు ఆడుతున్నాడు... టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియంసన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన రాస్ టేలర్, వచ్చే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు తెలపబోతున్నట్టు ప్రకటించాడు...

‘ఈరోజు నా అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్ గురించి ప్రకటన ఇస్తున్నా. బంగ్లాదే‌శ్‌తో జరిగే రెండు టెస్టులు, ఆ తర్వాత ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరిగే 6 వన్డే మ్యాచులు ఆడి... క్రికెట్ నుంచి తప్పుకుంటా. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అన్ని విధాల సహకరించినవారందరికీ థ్యాంక్స్. నా దేశం తరుపున ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా... ’ అంటూ ట్వీట్ చేశాడు రాస్ టేలర్.

Scroll to load tweet…

37 ఏళ్ల రాస్ టేలర్, 2006లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. 233వన్డేలు ఆడిన టేలర్, 102 టీ20 మ్యాచులు ఆడి న్యూజిలాండ్ తరుపున అత్యధిక వన్డేలు, అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

109 టెస్టుల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7584 పరుగులు చేసిన రాస్ టేలర్, పుట్టినరోజున వన్డే సెంచరీ చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేశాడు. 81 బంతుల్లో టెస్టు సెంచరీ చేసి, టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన న్యూజిలాండ్ ప్లేయర్‌గా నిలిచాడు.

అంతేకాకుండా వన్డే, టీ20, టెస్టుల్లో 100కు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రాస్ టేలర్, 233 వన్డేల్లో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలతో 8581 పరుగులు చేశాడు. 102 టెస్టుల్లో 7 హాఫ్ సెంచరీలతో 1909 పరుగులు చేశాడు.

మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్‌కి సారథిగానూ వ్యవహరించిన రాస్ టేలర్, 2007 టీ20 వరల్డ్‌కప్, 2007 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీల్లోనూ ఆడాడు. 2007 నుంచి 2016 వరకూ అన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరుపున ఆడిన రాస్ టేలర్‌కి, 2021 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో చోటు దక్కలేదు.

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ టైటిల్ గెలిస్తే, రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడు రాస్ టేలర్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పరాజయంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు...

ఫిట్‌నెస్ ఉన్నంతకాలం, వికెట్ల మధ్యన పరుగులు తీయగలిగినంత కాలం క్రికెట్‌లో కొనసాగుతానని ప్రకటించిన రాస్ టేలర్, 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి వీడ్కోలు చెప్పేందుకు ఎట్టకేలకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణే వారియర్స్ ఇండియా వంటి జట్లకి ఆడిన రాస్ టేలర్‌, 2015 తర్వాత వేలంలో అమ్ముడుపోలేదు.