INDvsNZ: న్యూజిలాండ్ బౌలర్  జాకబ్ డఫ్ఫీ  వన్డేలలో అత్యంత చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.   ఇండోర్ వన్డేలో పది ఓవర్లు వేసిన అతడి బౌలింగ్ లో భారత బ్యాటర్లు  పండుగ చేసుకున్నారు. 

ఇండోర్ వేదికగా ముగిసిన ఇండియా-న్యూజిలాండ్ మూడో వన్డేలో కివీస్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు పది ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా వంద పరుగులు సమర్పించుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తో పాటు చివరి వరుస బ్యాటర్లు కూడా మెరుపులు మెరిపించడంతో డఫ్ఫీకి తిప్పలు తప్పలేదు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో పది ఓవర్లలో 3 వికెట్లు తీసి 100 పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు. 

గతంలో బంగ్లాదేశ్ బౌలర్ షఫిఉల్ ఇస్లాం.. పది ఓవర్లలో 95 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇండోర్ వన్డేలో డఫ్ఫీ ఈ రికార్డును చెరిపేశాడు. ఈ మ్యాచ్ లో అతడు మరో ఐదు పరుగులు ఎక్కువే ఇచ్చాడు. 

ఇక వన్డేలలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన లూయిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో అతడు పది ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 113 పరుగులిచ్చాడు. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్ వహబ్ రియాజ్.. ఇంగ్లాండ్ పై 10 ఓవర్లు విసిరి వికెట్లేమీ తీయకుండా 110 పరుగులు సమర్పించాడు.

ఈ జాబితాలో రషీద్ ఖాన్ (9 ఓవర్లు 110), బొయిస్సెవేన్ (10 ఓవర్లు 108), భువనేశ్వర్ కుమార్ (10 ఓవర్లు 106), ప్రదీప్ (10 ఓవర్లు 106), సౌధీ (10 ఓవర్లు 105), విటోరి (9 ఓవర్లు 105), హోల్డర్ )10 ఓవర్లు 104), వినయ్ కుమార్ (9 ఓవర్లు 102), జద్రాన్ (10 ఓవర్లు 101), హసన్ అలీ (9 ఓవర్లు 100), ఎ.జె.టై (9 ఓవర్లు 100) డఫ్ఫీ కంటే ముందున్నారు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (10 ఓవర్లలో 99) రికార్డును డఫ్ఫీ చెరిపేశాడు. డఫ్పీ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో ట్విటర్ లో అతడిపై మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 

Scroll to load tweet…

మ్యాచ్ విషయానికొస్తే.. ఇండోర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) లు సెంచరీలతో కదం తొక్కారు. హార్ధిక్ పాండ్యా (54) రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్.. 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌట్ అయింది. డెవాన్ కాన్వే (138) మెరుపు సెంచరీ చేసినా మిగిలిన వాళ్లు విఫలం కావడంతో ఆ జట్టు 90 పరుగుల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక తర్వాత భారత్.. ఈ సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసుకుంది. ఇక కివీస్ తో ఈనెల 27 నుంచి భారత్ టీ20 సిరీస్ ఆడనుంది.

Scroll to load tweet…