Asianet News TeluguAsianet News Telugu

లంకను ముంచెత్తిన షిప్లే.. భారీ తేడాతో గెలిచిన కివీస్.. శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఆశలు ఆవిరి..!

NZ vs SL ODI: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంకకు టెస్టులతో పాటు వన్డేలలోనూ షాకులు తాకుతున్నాయి. కివీస్ పేసర్ షిప్లే ధాటికి  లంక విలవిల్లాడింది. 

New Zealand Beat Sri Lanka by 198 Runs, Dasun Shanaka Team's World Cup chances suffer huge blow MSV
Author
First Published Mar 25, 2023, 4:38 PM IST

వరల్డ్  టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలతో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక..   ఏదీ కలిసిరావడం లేదు. టెస్టులలో  కివీస్.. 2-0 తేడాతో లంకను  ఓడించింది. ఇప్పుడు వన్డేలలో కూడా  న్యూజిలాండ్..  శ్రీలంకకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.  ఆక్లాండ్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో  న్యూజిలాండ్.. శ్రీలంకపై  198 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడటంతో శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఆశలు కూడా ఆవిరయ్యాయి.  

ఈ  మ్యాచ్ లో తొలుత టాస్  ఓడి బ్యాటింగ్ చేసిన   న్యూజిలాండ్..  49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్ అయింది.   ఆ జట్టులో ఓపెనర్ ఫిన్ అలెన్ (51), రచిన్ రవీంద్ర (49), డారిల్ మిచెల్ (47), గ్లెన్ ఫిలిప్స్ (39) లు రాణించారు. లంక బౌలర్ చమీక కరుణరత్నె నాలుగు వికెట్లు తీశాడు.  కసున్ రజిత, లాహిరు కుమారలు తలా రెండు వికెట్లతో దుమ్మురేపారు. 

అనంతరం లక్ష్య ఛేదనలో లంక..  కివీస్ బౌలర్  హెన్రీ షిప్లే ధాటికి గజగజ వణికింది. ఏడు ఓవర్లు వేసిన షిప్లే.. 31 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. షిప్లే ధాటికి  పతుమ్ నిస్సంక (9), కుశాల్ మెండిస్ (4), చరిత్ అసలంక (9), కెప్టెన్ దసున్ శనక (0), చమీక కరుణరత్నె (11) లు క్రీజులో నిలబడటానికే  భయపడ్డారు.  లంక జట్టులో  మాథ్యూస్.. హయ్యస్ట్  రన్ స్కోరర్. అతడు 18 పరుగులు చేశాడు.  షిప్లేతో పాటు మిచెల్, టిక్నర్ లు కూడా తలా రెండు వికెట్లు తీశారు.  

 

ప్రపంచకప్ ఆశలు ఆవిరి.. 

ఈ మ్యాచ్ లో ఓడటంతో లంక.. అక్టోబర్ లో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం నేరుగా అర్హత సాధించే అవకాశాలను మరింత చేజార్చుకుంది. వరల్డ్ కప్  సూపర్ లీగ్ లో  ఈ సీజన్ ముగిసేసరికి టాప్ - 8లో టీమ్స్  ప్రపంచకప్ ఆడేందుకు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకు  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ లు  ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించాయి. 8వ స్థానం కోసం సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక లు పోటీ పడుతున్నాయి. కివీస్ తో మ్యాచ్ లో ఓటమి తో  శ్రీలంక.. 77 పాయింట్లతో పదో స్థానానికి పడిపోయింది.

 ఈ నెలాఖరున దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్ తో  రెండు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్ లు గెలిస్తే   ఆ జట్టు నేరుగా అర్హత సాధిస్తుంది.   ప్రస్తుతం  వరల్డ్ కప్ లో నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశాలు ఆ  జట్టుకే ఎక్కువున్నాయి.ఇదే జరిగితే   వెస్టిండీస్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక లు క్వాలిఫయర్ పోటీల్లో ఆడాల్సి ఉంటుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios