ENG vs NZ: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో స్ఫూర్తిదాయకంగా ఆడుతున్నది. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
క్రికెట్ లో సిక్సర్ కొడితే ప్రేక్షకులు దానిని క్యాచ్ పట్టడం.. ఆ క్రమంలో కొంతమందికి గాయాలు కావడం సహజం. కానీ న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ రూటే సెపరేటు. అతడు కొట్టిన సిక్సర్.. గ్యాలరీలో మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని బీర్ గ్లాస్ లో పడింది. బంతి వచ్చి నేరుగా గ్లాస్ లో పడగానే బీర్ అంతా అక్కడ చిల్లడమే గాక మొత్తం కిందపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ట్రెంట్ బ్రిడ్జిలో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలు విషయానికొస్తే.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ జాక్ లీచ్ 56వ ఓవర్ వేశాడు. ఈ డెలివరీని మిచెల్.. స్ట్రెయిట్ భారీ షాట్ ఆడాడు. బంతి కాస్తా మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఒక మహిళ వద్ద పడింది.
అయితే అదే సమయంలో సదరు మహిళ చేతిలో బీర్ గ్లాస్ పట్టుకుంది. ఉంది. మిచెల్ కొట్టిన బంతి వచ్చి ఆ బీర్ గ్లాస్ లో పడటం.. బీర్ అంతా ఒలికిపోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయాయి. బాల్ వచ్చి నేరుగా గ్లాస్ లో పడటంతో అది కూడా పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక బీర్ పడగానే కామెంట్రీ చెబుతున్న కామెంటేటర్లు కూడా.. ‘ఇది బీర్ లోకి కొట్టబడింది...’ అని కామెంట్ చేశారు. ఇక వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. ‘ఇలా కూడా చీర్స్ చెప్పొచ్చా మిచెల్..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్టులో తొలి రోజు కివీస్ దే. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (81 నాటౌట్), టామ్ బ్లండెల్ (67 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 149 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి టెస్టులో రాణించిన మాథ్యూ పాట్స్ ఈ టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
