India Tour Of New Zealand: టీ20 ప్రపంచకప్ లో అనూహ్యంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన  టీమిండియా, న్యూజిలాండ్ జట్లు త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరస్ లు ఆడనున్నాయి. 

ప్రపంచకప్ వైఫల్యాల తర్వాత టీమిండియా, న్యూజిలాండ్ లు మరో ఆసక్తికర సమరానికితెరతీయనున్నాయి. ఈనెల 18 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్ లు జరుగనున్నాయి. ఈ మేరకు భారత్ తో తలపడబోయే జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. వరుసగా ఐసీసీ టోర్నీలలో విఫలమవుతున్నా న్యూజిలాండ్ క్రికెట్ మాత్రం కేన్ విలియమ్సన్ ను వదలడం లేదు. భారత్ తో సిరిస్ కు కూడా కేన్ మామనే సారథిగా వ్యవహరించనున్నాడు. డెవాన్ కాన్వే వైస్ కెప్టెన్ గా ఉంటాడు. 

కేన్ మామను సారథిగా కొనసాగించిన యాజమాన్యం కివీస్ స్టార్ ఆటగాళ్లైన ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గప్తిల్ లకు జట్టులో చోటు కల్పించలేదు. దీంతో ఈ ఇద్దరి అంతర్జాతీయ కెరీర్ లకు ఎండ్ కార్డ్ పడ్డట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతకొంతకాలంగా ఫామ్ కోల్పోయిన ఆడమ్ మిల్నే తిరిగి జట్టుతో చేరాడు.

గతకొంతకాలంగా దేశవాళీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న ఫిన్ అలెన్ ను టీ20లతో పాటు వన్డేలకూ ఎంపిక చేసిన యాజమాన్యం ఇదేవిషయాన్ని చెప్పకనే చెప్పింది. గప్తిల్ కు ముందస్తు వీడ్కోలుగానే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. గప్తిల్ తో పాటు ట్రెంట్ బౌల్ట్ పైనా బోర్డు కఠినంగా వ్యవహరిస్తున్నది. కొద్దికాలం క్రితమే బౌల్ట్.. బోర్డుతో కాంట్రాక్టును వదులుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున తాను ఆడతానని చెప్పినప్పటికీ ఫ్రాంచైజీ లీగ్ లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. బౌల్ట్ బాటలోనే మరో ఇద్దరు క్రికెటర్లు కూడా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్టును వదులుకున్నారు. టీ20 ప్రపంచకప్ ఉందని బౌల్ట్ పై చూసీ చూడనట్టుగా వ్యవహరించిన కివీస్ బోర్డు.. వచ్చే వన్డే, టీ20 ప్రపంచకప్ లకు కొత్త ఆటగాళ్లను తయారుచేసుకోవాలని భావిస్తున్నది. 

వన్డే, టీ20లకు కివీస్ జట్టు : కేన్ విలియ్సమన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వ, మైఖేల్ బ్రేస్వెల, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డేలకు),డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20లకు), టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ 

Scroll to load tweet…

భారత్-న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ : 

ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ లు మొదట మూడు టీ20లు ఆతర్వాత మూడు వన్డేలు ఆడతాయి. నవంబర్ 18న మొదటి టీ20, 20 న రెండు, 22న మూడో టీ20 జరుగుతాయి. నవంబర 25న తొలి వన్డే, 27న రెండో వన్డే, 30న మూడో వన్డేలు జరగాల్సి ఉంది. 

* కివీస్ తో వన్డే, టీ20 సిరీస్ లకు శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యాలు సారథులుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే.