ఐపిఎల్ సీజన్ 12 ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. అయినా ఈ లీగ్  గురించి అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చలు  కొనసాగుతూనే వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరుపై మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరీముఖ్యంగా కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదే చెన్నై గెలుపు అవకాశాలను దెబ్బతీసిందన్నది  వారి వాదన. అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషన్ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. 

ఐపిఎల్ లో పాల్గొనకున్నా నీషన్ ఈ సీజన్ ను ఫాలో అయినట్టున్నాడు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్  సందర్భంగా సీఎస్కే కెప్టెన్ ధోని రనౌట్  పై వివాదం చెలరేగడం అతడి దృష్టికి  వెళ్లినట్లుంది. దీంతో ఈ రనౌట్ పై తన అభిప్రాయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. అదికాస్తా చెన్నై అభిమానులకు నచ్చకపోవడంతో అదే ట్విట్టర్ ద్వారా నీషమ్ ను ఓ ఆటాడుకుంటున్నారు. 

''కొందరు అభిమానులు క్రికెట్ అంటే ఇంత ప్యాషనేట్ గా వుండటం తనకెంతో నచ్చింది. నాకు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. కానీ ఈ కింది ఫోటోను చూసి అది నాటౌట్ అంటే ఆశ్చర్యంగా వుంటోంది'' అని ట్వీట్ చేసి దీనికి ధోని రనౌట్ ఫోటో జతచేశాడు. ఇదే సీఎస్కే అభిమానుల  ఆగ్రహానికి కారణమవుతోంది. 

అయితే ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అలా ట్వీట్ చేశాడో లేడో అభిమానులు అతడికి వ్యతిరేకంగా కామెంట్ చేయడం ప్రారంభిచారు. ''నువ్వో అంతర్జాతీయ క్రికెటర్ అంటే మాకు నమ్మబుద్ది కావడం లేదు'', '' అంపైర్లకే కాదు నీషన్ ను కూడా ఎవరో మేనేజ్ చేసినట్లున్నారు'' అంటూ వివిధ  రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ ట్వీట్ కు అత్యధికంగా  నెగెటివ్ కామెంట్స్  వస్తుండటంతో నీషన్ దాన్ని డిలేట్ చేశాడు. 

ఆ  ట్వీట్ ను ఎందుకు డిలేట్ చేయాల్సి వచ్చిందోకూడా వివరణ ఇచ్చుకున్నాడు. '' ఎంఎస్ ధోని రనౌట్ గురించి చేసిన ట్వీట్ ను డిలేట్ చేశా. నా  అభిప్రాయాన్ని మార్చుకుని ఈ  పని చేయలేదు. 
ఎందుకలా చేశానంటే  
1. రోజూ 200 పైగా అధికంగా చెత్త కామెంట్స్ రావడం...వాటిని చూసి నేను అనారోగ్యానికి గురవడం జరిగింది. 
2. నేను వాటిని అసలు నేను కేర్ చేయలేదు.
దయచేసి మళ్లీ నాకు ఈ విషయం గురించి  ట్వీట్ చేయకండి. అందరికి గుడ్ డే'' అంటూ నీషన్ వివరణ ఇచ్చుకున్నాడు.