Asianet News TeluguAsianet News Telugu

MS Dhoni: ‘ఏంది బ్రో అంత మాటన్నావ్’! ధోని ‘ఓరియో బిస్కెట్ లింక్’పై పేలుతున్న జోకులు

MS Dhoni Oreo Add: ‘ఊరించి ఉసూరుమనిపించడం’ అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఇవాళ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని వ్యవహారం చూస్తే  పైన సామెత చక్కగా సరిపోతుంది. 
 

Netizens Trolls MS Dhoni on His New Add, Advice Him To Stop This Stunts
Author
First Published Sep 25, 2022, 5:02 PM IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్ లో ఏడాదికోసారి కనిపిస్తున్నా టీమిండియా అభిమానుల్లో ధోనిమీద ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ‘మిస్టర్ కూల్’ అని బిరుదులు అందుకుంటున్న మహేంద్రుడు ఏదైనా కార్యక్రమాలకు వెళ్లి చెప్పే మాటలు కూడా స్ఫూర్తివంతంగా ఉంటాయి. కానీ తాజాగా ధోని చేసిన పని మాత్రం విమర్శలకు తావిస్తున్నది. మరీ ఓ బిస్కెట్ కంపెనీ ప్రచారం కోసం దేశం నెగ్గిన ప్రపంచకప్ ‌తో పోల్చడమేంటని అతడి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు.  ఏదో యాడ్ రూపంలో చెప్పినా ఏమో గానీ  ఈ దిక్కుమాలిన లాజిక్ ను పాత్రికేయుల సమావేశం పెట్టి మరీ చెప్పాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అసలు విషయానికొస్తే.. శనివారం ధోని తన ఫేస్బుక్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘నేను రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఓ ఎగ్జైటింగ్  విషయం చెప్పబోతున్నా..’ అని అందులో పేర్కొన్నాడు. అయితే ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్టు ఉండే సోషల్ మీడియాలో ధోని పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ధోని రిటైర్ అవుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. 

కానీ కార్యక్రమానికి వచ్చిన ధోని.. ‘భారత్ లో ఓరియో 2011లో లాంచ్ అయింది. అదే ఏడాది టీమిండియా ప్రపంచకప్ నెగ్గింది. మీకు లింక్ అర్థం అవుతుంది కదా..’ ఈ రెండు వ్యాఖ్యాలను  మరీ విసుగొచ్చేలా ఓ పదిసార్లు చెప్పాడు. ధోని అలా చెబుతుంటే అదేదో సినిమాలో చెప్పినట్టు.. ‘ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ పాక్ కరేపాక్..’ అన్న డైలాగ్ గుర్తొచ్చింది. ఆ తర్వాత మళ్లీ.. ‘చరిత్రను సృష్టించాలంటే చరిత్రను తిరగరాయాలి’ అని నీతి వ్యాఖ్యలు భోదిస్తూ.. ‘ఈ ఏడాది కూడా మరో ప్రపంచకప్ (ఆస్ట్రేలియాలో జరిగే టీ20  వరల్డ్ కప్)  ఉంది.  కావున, ఓరియో తిరిగి లాంచ్ అయితే టీమిండియా కూడా  ప్రపంచకప్ నెగ్గుతుంది..’ అని చెప్పి అక్కడ్నుంచి జారుకున్నాడు. 

 

బిస్కెట్లతో పోలికా..? 

ఈ కార్యక్రమంలో మహీ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ లో నెటిజన్లతో పాటు అతడి అభిమానులు కూడా ధోనిని ఆటాడుకుంటున్నారు. ‘టీమిండియా ప్రపంచకప్ విజయాలు  నీకు బిస్కెట్లలా కనిపిస్తున్నాయా..?’, ‘ఈ బిస్కెట్ లాజిక్ ఏంటో అర్థం కావడం లేదు’, ‘మరి 1987, 2007లో ఏ బిస్కెట్ లాంచ్ అయింది ధోని’ అని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

మీమ్స్ వర్షం.. 

ధోని ‘బిస్కెట్ లాజిక్’ కు ఆగ్రహాలతో పాటు సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. పలువురు యూజర్లు స్పందిస్తూ.. ‘ఏంది బ్రో అంత మాటన్నావ్..’ ‘ఇంత పెద్ద దెబ్బ వేశావేంటన్న.. మేమింకేదో అనుకున్నాం’,‘ఓరేయ్, అసలు స్క్రిప్ట్ ఇచ్చింది ఎవడురా..? ధోని మాటల కంటే ఆ బిస్కట్లే బాగున్నాయి..’, ‘అబ్బా అర్జెండ్ గా షాప్ కు వెళ్లి రెండు ఓరియో బిస్కెట్లు తెచ్చుకుంటా. అన్న చెప్పాడుగా..’, ‘ఓరియో మ్యాగీ, ఓరియో దోస, ఓరియో  శార్ధం, ఓరియో పిండాకూడు’ అని ధోనిని ఆటాడుకుంటున్నారు. ఇక ధోని డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ‘ప్రమోషన్స్ కోసం టీమిండియా ప్రపంచకప్ విజయాన్ని మరీ బిస్కెట్ల స్థాయికి దిగజార్చావా అన్నా...’ అని కన్నీరుమున్నీరవుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios