ఏషియన్ గేమ్స్ 2023: వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసిన నేపాల్.. యువీ, రోహిత్ రికార్డులు బ్రేక్...
మంగోలియాతో మ్యాచ్‌లో 314 పరుగుల రికార్డు స్కోరు చేసిన నేపాల్... ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దీపేంద్ర సింగ్ ఆరీ, ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ బాదిన కుసాల్ మల్లా...
మొట్టమొదటిసారి ఆసియా కప్ 2023 టోర్నీ ఆడిన నేపాల్, ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 314 పరుగుల రికార్డు స్కోరు చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 300+ స్కోరు చేసిన మొట్టమొదటి జట్టుగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది నేపాల్.. ఇప్పటిదాకా 2019లో ఆఫ్ఘాన్, ఐర్లాండ్‌పై, చెక్ రిపబ్లిక్, టర్కీపై చేసిన 278 పరుగులే టీ20ల్లో టాప్ స్కోరు...
కుసాల్ బుర్టెల్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా ఆసీఫ్ షేక్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యే సమయానికి 7.2 ఓవర్లలో 66 పరుగులే చేసింది నేపాల్. అసలైన కథ అక్కడి నుంచే మొదలైంది. కెప్టెన్ రోహిత్ పాడెల్, కుసాల్ మల్లా కలిసి సిక్సర్ల మోత మోగించారు..
27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 61 పరుగులు చేసిన రోహిత్, 19వ ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. కుసాల్ మల్లా 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 137 పరుగులు చేయగా ఇన్నింగ్స్‌లో చివరి 11 బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చిన దీపేంద్ర సింగ్ 10 బంతుల్లో 8 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు..
34 బంతుల్లో సెంచరీ చేసిన కుసాల్ మల్లా, టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఇంతకుముందు డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ సుదీశ్ విక్రమశేఖర 35 బంతుల్లో టీ20 సెంచరీలు నమోదు చేశారు.
9 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న దీపేంద్ర సింగ్ ఆరీ, టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బ్రేక్ చేశాడు. ఇంతకుముందు యువరాజ్ సింగ్, 2007 టీ20 వరల్డ్ కప్‌లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ టీ20 మ్యాచుల్లో క్రిస్ గేల్, ఆఫ్ఘాన్ ప్లేయర్ హజ్రతుల్లా జిజాయ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు.
నేపాల్ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 26 సిక్సర్లు ఉన్నాయి. ఇది కూడా వరల్డ్ రికార్డే. ఇంతకుముందు ఐర్లాండ్‌పై ఆఫ్ఘాన్ 2019లో, వెస్టిండీస్, సౌతాఫ్రికాపై 2023లో 22 సిక్సర్లు బాదాయి.
315 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో మంగోలియా, 13.1 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మంగోలియా బ్యాటర్లలో దేవసురెన్ జమయసురేన్ (10 పరుగులు) మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరు దాటాడు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, మంగోలియా చేసిన 41 పరుగుల్లో 23 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి.
273 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న నేపాల్, టీ20 క్రికెట్‌లో అత్యధిక తేడాతో విజయం అందుకున్న జట్టుగానూ నిలిచింది.