ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 విజేతగా నిలిచిన నేపాల్ టీమ్.. మొట్టమొదటి సారి ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోతున్న నేపాల్.. 

క్రికెట్ పసికూన నేపాల్ చరిత్ర సృష్టించింది. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2023 విజేతగా నిలిచి, మొట్టమొదటి సారి ఆసియా కప్ టోర్నీలో ఆడబోతోంది. గ్రూప్ గ్రూప్‌లుగా జరిగిన ఈ ప్రీమియర్ కప్ టోర్నీలో నేపాల్‌తో పాటు ఆసియాలోని అసోసియేట్ దేశాలు ఓమన్, మలేషియా, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, హంగ్‌కాంగ్, బెహ్రాయిన్, సింగపూర్ పాల్గొన్నాయి.

గ్రూప్ ఏలో టాపర్‌గా నిలిచిన నేపాల్, కువైట్, యూఏఈ, ఓమన్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా యూఏఈ, నేపాల్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. క్రితిపూర్‌లో జరిగిన ఫైనల్‌లో యూఏఈపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసియా కప్ 2023 టోర్నీకి అర్హత సాధించింది నేపాల్..

Scroll to load tweet…

తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ, 33.1 ఓవర్లలో 117 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అసిఫ్ ఖాన్ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేయగా ఆర్యన్ లక్రా 13, కెప్టెన్ మహమ్మద్ వసీం 11, బాసిల్ హీద్ 10, జునైద్ సిద్ధికీ 10 పరుగులు చేశారు. నేపాల్ బౌలర్ రాజ్‌బన్సీ 4 వికెట్లు తీయగా కరణ్, సందీప్ లమిచానే రెండేసి వికెట్లు తీశారు.

గుల్షాన్ జా 84 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేయగా భీమ్ శక్తి 72 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి నేపాల్‌కి విజయాన్ని అందించారు. 

సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ 2023 టోర్నీలో నేపాల్‌తో పాటు ఇండియా, పాకిస్తాన్ టీమ్స్ గ్రూప్ Aలో ఉంటే శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ Bలో ఉంటాయి. అయితే ఆసియా కప్ 2023 వేదికపై ఇంకా క్లారిటీ రాలేదు..

షెడ్యూల్ ప్రకారం వన్డే ఫార్మాట్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సొంతం చేసుకుంది. అయితే పాక్‌లో ఆసియా కప్ పెడితే తాము ఆడబోమని భారత జట్టు ప్రకటించడంతో దీనిపై వివాదం రేగింది..

పాక్‌లో పెట్టాల్సిందేనని పీసీబీ, లేదు తటస్థ వేదికపై జరపాల్సిందేనని బీసీసీఐ పట్టుబడుతున్నాయి. దీనిపై ఈ నెలఖారులోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా ఆడే మ్యాచులను యూఏఈలో, మిగిలిన మ్యాచులను పాకిస్తాన్‌లో నిర్వహంచాలనే ప్రతిపాదన కూడా వినబడింది. అయితే దీనికి మిగిలిన టీమ్స్ అంగీకరించాల్సి ఉంది..

ఇలా రెండు వేదికల్లో ఆసియా కప్ నిర్వహించడానికి శ్రీలంక, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్ వంట టీమ్స్ ఒప్పుకుంటే, సెప్టెంబర్‌లో ఈ టోర్నీ సజావుగా సాగుతుంది. లేదంటే పాక్‌లో ఆడడానికి ఇండియా ఒప్పుకోకపోతే ఆసియా కప్ 2023 టోర్నీలో భారత జట్టు ఆడకపోవచ్చు లేదా పూర్తిగా ఆసియా కప్ 2023 టోర్నీనే రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..