8 బంతుల్లో 25 పరుగులు.. మ్యాంగో మ్యాన్‌కు బ్యాటింగ్ కూడా వచ్చా..! మళ్లీ కోహ్లీని గెలుకుతున్నారే..
Kohli vs Naveen: ఐపీఎల్ - 16 లో విరాట్ కోహ్లీతో వాగ్వాదం ద్వారా వెలుగులోకి వచ్చిన మ్యాంగో మ్యాన్ (నవీన్ ఉల్ హక్) టీ20 బ్లాస్ట్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ ట్యాలెంట్ కూడా చూపిస్తున్నాడు.

అఫ్గానిస్తాన్ ఆటగాడు, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిథ్యం వహించిన నవీన్ ఉల్ హక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి కోహ్లీతో గొడవపడ్డందుకు కాదు.. ఐపీఎల్ - 16 ముగిసిన తర్వాత నవీన్.. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో ఆడుతున్నాడు. ఈ లీగ్ లో లీస్టర్‌షైర్‌తో ఆడుతున్న నవీన్.. ఈసారి బౌలింగ్ లో కాకుండా బ్యాటింగ్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. 8 బంతుల్లోనే 25 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
టీ20 బ్లాస్ట్ లో భాగంగా రెండ్రోజుల క్రితం లీస్టర్‌షైర్ - నార్తంప్టన్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్.. నవీన్ బ్యాటింగ్ కు వచ్చే సమయానికి 18 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
కానీ నవీన్.. 19వ ఓవర్ వేసిన జేమ్స్ సేల్స్ బౌలింగ్ లో 6,4 బాదాడు. ఆండ్రూ టై వేసిన ఆఖరి ఓవర్లో కూడా రెండు భారీ సిక్సర్లు కొట్టి లీస్టర్‌షైర్ స్కోరును 164 పరుగులకు చేర్చాడు. అయితే నవీన్ మెరుపులు వృథా అయ్యాయి. నార్తంప్టన్‌షైర్ ఈ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ క్రిస్ లిన్.. 68 బంతుల్లోనే 13 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి ఆ జట్టుకు ఈజీ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ లో నవీన్.. 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.
కాగా నవీన్ 8 బంతుల్లో 25 పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో అతడిని పొగుడుతూ ట్వీట్ వేసింది. దీంతో కొంతమంది కోహ్లీ వ్యతిరేకులు.. ‘నవీన్ ఒక వ్యక్తి కంటే బాగా ఆడాడు’అని పరోక్షంగా కోహ్లీని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ‘ఇంగ్లాండ్ లో కూడా మామిడిపండ్లు దొరుకుతాయా..?’ అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ - 16 ముగియడంతో నవీన్ - కోహ్లీల వివాదం సద్దుమణిగిందని అనుకుంటుంటే తాజాగా మళ్లీ అభిమానులు కొత్త రకంగా కొట్టుకోవడం మొదలుపెట్టారు.