గాయంతో యాషెస్ సిరీస్ 2023 నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్.. వరుసగా 100 టెస్టులు ఆడిన మొట్టమొదటి బౌలర్‌గా లియాన్ చరిత్ర..
లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో గెలిచి, యాషెస్ సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్, రెండో ఇన్నింగ్స్‌లో కుంటుతూ బ్యాటింగ్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..
ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కంకూషన్ సబ్‌సిట్ట్యూట్‌గా మరో స్పిన్నర్‌ని తుది జట్టులో తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా దాన్ని వాడుకోలేదు. కుంటుతూనే బ్యాటింగ్‌కి వచ్చిన నాథన్ లియాన్, ఇంగ్లాండ్ బౌలర్ల బౌన్సర్ల ధాటికి ఇబ్బంది పడుతూనే 13 బంతులు ఫేస్ చేశాడు..
మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న నాథన్ లియాన్, మిగిలిన యాషెస్ సిరీస్ నుంచి దూరమయ్యాడు. నాథన్ లియాన్ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో అతన్ని జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా..
యాషెస్ సిరీస్‌లో భాగంగా జూలై 6 నుంచి లీడ్స్‌లోని హెడ్డింగ్‌లీలో మూడో టెస్టు జరగనుంది. 101 మ్యాచుల తర్వాత నాథన్ లియాన్ లేకుండా ఆస్ట్రేలియా ఆడే తొలి టెస్టు కానుంది లీడ్స్ టెస్టు. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన నాథన్ లియాన్, వరుసగా 100 టెస్టులు ఆడిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..
ఇంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్, 2006 నుంచి 2018 వరకూ వరుసగా 159 టెస్టులు ఆడగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 153 టెస్టులు, మార్క్ వాగ్ 107 టెస్టులు ఆడారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వరుసగా 106 టెస్టులు ఆడగా, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 101 టెస్టులు ఆడాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డును సమం చేసిన నాథన్ లియాన్, గాయం కారణంగా ఈ జాబితాలో టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కోల్పోయాడు..
తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన నాథన్ లియాన్, రెండో టెస్టులో 13 ఓవర్లు బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ తీశాడు. గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. నాథన్ లియాన్ స్థానంలో యంగ్ స్పిన్నర్ టాడ్ ముర్ఫీకి అవకాశం దక్కొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన టాడ్ ముర్ఫీ, 4 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు..
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుటైన హారీ బ్రూక్ వంటి ఇంగ్లాండ్ బ్యాటర్లకు అతను యాషెస్ సిరీస్ నుంచి తప్పుకోవడం మంచి వార్తే. తొలి రెండు టెస్టుల్లో ఓడినా, మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచి 3-2 తేడాతో సిరీస్‌ని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్..
121 టెస్టుల్లో 496 వికెట్లు తీసిన నాథన్ లియాన్, ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 688 టెస్టు వికెట్లతో, అతని టీమ్‌మేట్ స్టువర్ట్ బ్రాడ్ 593 వికెట్లతో ప్రస్తుత క్రికెట్ ఆడుతున్నవారిలో టాప్ వికెట్ టేకర్లుగా ఉన్నారు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 92 టెస్టుల్లో 474 వికెట్లు తీసి, నాథన్ లియాన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు..
