టీమిండియా మహిళా జట్టుకు బిసిసిఐ ప్రత్యేక బౌలింగ్ కోచ్ ను నియమించింది. అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మహిళా స్పిన్ బౌలర్లకు  ఉపయోగపడేలా జాతీయ క్రికెట్‌ అకాడమీ స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు ఎల్లప్పుడు జట్టుతో పాటే వుండకుండా  ఎంపిక  చేసిన సీరిస్ లకు మాత్రమే భారత స్పిన్నర్లకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. 

''ఆయన జాతీయ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నందున ఎక్కువ సమయం భారత క్రికెటర్లకు శిక్షణ  ఇవ్వకపోవచ్చు. కానీ అతడి సలహాలు, సూచనలు ఇప్పుడు జట్టులో వున్న స్పిన్నర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా భారత స్పిన్ విభాగం పటిష్టం కావడానికి నరేంద్ర సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని  నమ్ముతున్నాం'' అని ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. 

భారత పురుష జట్టు తరపున నరేంద్ర 17 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. అయితే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత జాతీయ అకాడమీలో తన సేవలను వినియోగిస్తూ యువ ఆటగాళ్లను మెరుగైన స్పిన్నర్లుగా తీర్చిదిద్దుతున్నాడు. అతడి వద్ద శిక్షణ పొందిన చాలా మంది వివిధ స్థాయిల్లో ఉత్తమ స్పిన్ బౌలర్లుగా రాణిస్తున్నారు.

అయితే ప్రస్తుతం భారత మహిళా జట్టులో దీప్తి శర్మ, ఎక్తా బిస్త్, పూనమ్ యాదవ్ వంటి  స్పిన్నర్లున్నారు. అయితే వీరంతా కలిసి తమకు సరైనా సలహాలిచ్చి మరింత రాణించేందుకు ఉపయోగపడేలా ఓ స్పిన్ సలహాదారును నియమించాలని  బిసిసిఐని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు నరేంద్ర హీర్వానిని  నియమించింది. అతడు మరో రెండు  నెలల్లో జరగనున్న దక్షిణాఫ్రికా సీరిస్ లో జట్టుకు అందుబాటులో వుండనున్నాడు.