భారత క్రికెట్ ను ఎంతో ప్రభావితం చేసిన బిసిసిఐ అధ్యక్షుల్లో ఎన్. శ్రీనివాసన్ ఒకరు. అయితే పలు వివాదాల నేపథ్యంలో అతడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష  పదవి నుండి అర్థాంతరంగా  తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతడు తన వారుసురాలిగా కూతురు రూపా గురునాథ్ ను ఎంచుకున్నారు. క్రికెట్ వ్యవహారాల్లో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని   శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు. తన కూతురు రూపాను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవమయ్యేట్లు పావులుకదిపి చివరకు అనుకున్నది సాధించారు. 

బిసిసిఐ అనుబంధ సంఘాలన్నిట్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ను మళ్లీ తన  చెక్కుచేతల్లోకి తీసుకోవాలని శ్రీనివాస్ భావించినట్లున్నాడు. తాను పోటీ చేసే అవకాశంలేదు కాబట్టి కూతురు రూపాను రంగంలోకి దింపాడు. ఆమె చేత టీఎన్‌సీఏ అధ్యక్ష పదవికి  గురువారమే నామినేషన్ వేశారు.  

నామినేషన్ల  గడువు ఈనెల 25వ తేదీ అంటే బుధవారంతో ముగియనుంది. అయినప్పటికి ఇప్పటివరకు టీఎన్‌సీఏ అధ్యక్ష పదవికోసం రూపా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పోటీ పడేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో రూప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. 

రూపా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయితే క్రికెట్ చరిత్రలో నిలిచిపోనున్నారు. బిసిసిఐ అనుబంధ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయిన తొలి మహిళగా రూపా గురునాథ్ నిలవనున్నాయి. ఇలా ఈనెల 26వ తేదీన జరిగే సర్వ సభ్య సమావేశానికి అధ్యక్షత వహించనున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
  
ఆదివారం జరిగిన సమావేశంలో రూపా పోటీచేస్తున్న ప్యానల్ నుండి వివిధ పోస్టులకు పోటీలో నిలిచే అభ్యర్థులను ఎంపికచేశారు. ఉపాధ్యక్షునిగా  రామస్వామి, సంయుక్త  కార్యదర్శిగా శంకర్, కోశాదికారిగా పార్థసారధి, ఉప  కోశాధికారిగా వెంకటరామన్ ఈ ప్యానల్ నుండి పోటీలో నిలవనున్నారు.