Asia Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించాడు. భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన కోహ్లీ తాజాగా..
గత కొంతకాలంగా తన ఆటతో కాకుండా ఆటేతర విషయాల్లో వార్తల్లో నిలుస్తున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రధాన లక్ష్యం భారత్ కు ప్రపంచకప్ ను అందించడమనని స్పష్టం చేశాడు. కోహ్లీ ఎన్ని మ్యాచులాడినా.. ఎన్ని విజయాలు సాధించినా అతడి కెరీర్ లో ఐసీసీ టోర్నీ లేని లోటు వెంటాడుతూనే ఉంది. తాజాగా కోహ్లీ దానిని కూడా సాధిస్తానని అంటున్నాడు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమని పేర్కొన్నాడు.
ఆగస్టులో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ‘నా ప్రధాన లక్ష్యం భారత్ కు ఆసియా కప్ తో పాటు ప్రపంచకప్ ను అందించడం. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం..’ అని పేర్కొన్నాడు.
ఆసియా కప్ నేపథ్యంలో ఆ టోర్నీకి అధికారిక ప్రసారదారుగా ఉన్న స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ పేర్కొన్న ఈ వ్యాఖ్యలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన మూడు ఫార్మాట్లలో ఆడాడు. కానీ ఒక టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డేలలో కలిపి మొత్తంగా 80 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో అతడు విశ్రాంతి తీసుకోవాలని కొందరు.. అవసరం లేదు ఆడాలని మరికొందరు ఎవరికి నచ్చిన అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అయితే కోహ్లీ మాత్రం విండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి పారిస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. విండీస్ పర్యటన ముగిసిన తర్వాత ప్రారంభం కాబోయే జింబాబ్వే టూర్ కు కోహ్లీని పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉండగా ఆసియా కప్ కోసం స్టార్ స్పోర్ట్స్ తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ప్రోమోలో ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ ఓ పాటతో కూడిన వీడియోను రూపొందించారు. ఇందులో ‘మా ఇండియా నెంబర్ వన్. ఇప్పుడు మేం ఆసియా (ఆసియా కప్) ను గెలుస్తాం. మా పొరుగుదేశాలు కూడా ఈ టోర్నీని గెలవడానికి ఆరాటపడుతున్నాయి. కానీ సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేమిక్కడికి వచ్చింది గెలవడానికే అని మా ప్రత్యర్థులకు చెబుతున్నాం..’ అంటూ సాగే పాటతో టీమిండియా ఉద్దేశాన్ని ప్రోమోలో చేర్చారు.
1984 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు భారత జట్టు ఏడుసార్లు ట్రోఫీ నెగ్గింది. శ్రీలంక ఐదుసార్లు గెలుపొందగా పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. మరి ఈసారి విజేత ఎవరవుతారని ఆసియా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
