Asianet News TeluguAsianet News Telugu

‘నన్ను అందరూ డాన్ బ్రాడ్‌మన్ అంటారు’... బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ ‘పిల్లకాకి’ కామెంట్లు...

బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో 5 వేల పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచిన ముష్ఫికర్ రహీం... తనను డ్రాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు... 

Mushfiqur Rahim comments he is called as don Bradman in Bangladesh after Century against Sri Lanka
Author
India, First Published May 20, 2022, 7:23 PM IST

టాలెంట్ కంటే నోటి దురుసు ఎక్కువగా ఉన్న ప్లేయర్లు కూడా కొందరు ఉంటారు. అలాంటివాళ్లు ఎంత సాధించినా, నోటి దురుసుతో ఆ సక్సెస్‌ను తక్కువ చేసుకుంటూ, ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటారు. తాజాగా బంగ్లా సీనియర్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం కూడా అలాంటి వ్యాఖ్యలతోనే ట్రోలింగ్‌కి గురవుతున్నాడు... స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టును బంగ్లాదేశ్ డ్రా చేసుకుంది.

ఏంజెలో మాథ్యూస్ 199 పరుగులు చేసి అవుట్ కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్ సెంచరీలు చేయడంలో బంగ్లాదేశ్ 465 పరుగులకి ఆలౌట్ అయ్యింది... 282 బంతుల్లో 4 ఫోర్లతో 105 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీమ్, టెస్టుల్లో 5 వేల పరుగులు చేసి మొట్టమొదటి బంగ్లా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత తనని తాను లెజెండరీ క్రికెటర్, ఆల్‌టైం గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చుకోవడం వివాదాస్పదమైంది... ‘బంగ్లాదేశ్‌లో అనుభవానికి ఎలాంటి విలువ లేదు. 17 ఏళ్లుగా క్రికెట్ ఆడడం అంటే మామూలు విషయం కాదు, నేను ఇప్పటికీ ఇలాగే ఆడాలని కోరుకుంటున్నా. బంగ్లాదేశ్ తరుపున 5 వేల టెస్టు పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలవడం గర్వంగా ఉంది. అయితే నేనే ఆఖరి వాడిని మాత్రం కాదు. చాలామంది సీనియర్లు ఈ రికార్డును కొడతారు. టెస్టుల్లో 8 వేలు, 10 వేల పరుగులు చేసేవాళ్లు కూడా ఉన్నారు...

బంగ్లాదేశ్‌లో నన్ను జనాలు, బ్రాడ్‌మన్‌తో పోలుస్తారు. నేను బ్యాటింగ్ చేస్తుంటే వారికి బ్రాడ్‌మన్‌లా కనిపిస్తానట. కుర్రాళ్లకు కూడా అనుభవం, సలహలు అవసరం. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా...’ అంటూ కామెంట్ చేశాడు ముష్ఫికర్ రహీం...

81 టెస్టుల్లో 36.8 యావరేజ్‌తో 8 టెస్టు సెంచరీలతో 5 వేల పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం, సెంచరీ కొట్టినా అందులో కొట్టింది ముష్టి 4 బౌండరీలు. అలాంటి నువ్వు 52 టెస్టుల కెరీర్‌లో 99.94 సగటుతో 29 సెంచరీలతో 6996 పరుగులు చేసిన ఆసీస్ ఆల్‌టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చుకోవడం అతికే అతి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు...

ఐపీఎల్‌లో ఎన్నో సీజన్ల పాటు పేరు రిజిస్టర్ చేయించుకున్నా, వేలంలో షార్ట్ లిస్టు కాని ప్లేయర్లలో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఒకడు. గత 14 సీజన్ల అనుభవాల కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకోలేదు ముష్ఫికర్...

క్రీజులో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ, అరుస్తూ, మిరుగుండ్లు వేసుకుని చూస్తూ... అతిగా ప్రవర్తించే ముష్ఫికర్ రహీంని టీమిండియాలో తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు. కారణంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు, పాకిస్తాన్ చేతుల్లో ఓడిన తర్వాత ‘ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. టీమిండియా ఓడిపోయింది...’ అంటూ పోస్టు చేశాడు ముష్ఫికర్. ఈ పోస్టు కారణంగా అతనిపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది, ఇప్పటికీ వస్తూనే ఉంది...

విమర్శలు ఎలా ఉన్నా, ముష్ఫికర్ రహీం ఓ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు ముష్ఫికర్ రహీం... ప్రస్తుత క్రికెట్‌లో వన్డేల్లో, టెస్టుల్లో ఐదు వేలకు పైగా పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు ముష్ఫికర్ రహీం...

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ మాత్రమే రెండు ఫార్మాట్లలో 5 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లుగా ఉన్నారు...

భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో 9200+ పైగా పరుగులు చేసి 10 వేల క్లబ్‌కి చేరువైనా, టెస్టుల్లో మాత్రం 3137 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అలాగే టెస్టుల్లో 8 వేలకు పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, వన్డేల్లో మాత్రం 4378 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

81 టెస్టుల్లో 149 ఇన్నింగ్స్‌ల్లో 36.66 యావరేజ్‌తో 5023 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం, వన్డేల్లో 233 మ్యాచులు ఆడి 6697 పరుగులు చేశాడు. టీ20ల్లో 100 మ్యాచులు ఆడి 1495 పరుగులు చేశాడు. అయితే ఇప్పటిదాకా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేకపోయిన క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు ముష్ఫికర్...

 

Follow Us:
Download App:
  • android
  • ios