బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్  ముష్ఫికర్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మైదానంలో తోటి క్రికెటర్ నే కొట్టబోయాడు. దీంతో.. వివాదంలో ఇరుక్కున్నాడు. కాగా.. తాజాగా ఈ వివాదంపై స్పందించింన ముష్ఫికర్ క్షమాపణలు తెలిపాడు. 

ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళితే... బంగ్లాదేశ్ గడ్డపై జరుగుతున్న బంగబంధు టీ20 కప్‌లో ఆడుతున్న ముష్ఫికర్.. ఓ క్యాచ్ విషయంలో సహచరుడితో గొడవకి దిగాడు. ఫాస్ట్ బౌలర్‌ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ ఫైన్‌ లెగ్ దిశగా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. దాంతో.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచింది.

బంతి గాల్లోకి ఎక్కువ ఎత్తులో లేవడంతో వికెట్ కీపర్‌ ముష్ఫికర్ రహీమ్ ఆ బంతిని క్యాచ్‌గా అందుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే.. అదే సమయంలో ఫీల్డర్ అహ్మద్ కూడా ఆ క్యాచ్ కోసం వచ్చాడు. దాంతో.. ఇద్దరూ ఢీకొనగా.. ఎట్టకేలకి క్యాచ్‌ని ముష్ఫికర్ ఒడిసిపట్టుకోగలిగాడు. కానీ.. క్యాచ్ పట్టిన వెంటనే కోపం తెచ్చుకున్న ముష్ఫికర్.. సహచర క్రికెటర్ అని కూడా చూడకుండా అహ్మద్‌ని కొట్టడానికి వెళ్లాడు. కాగా..  ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది.

ఒక జూనియర్‌ క్రికెటర్‌పై రహీమ్‌ ఇలా ప్రవర్తించడమేంటని పలువురు మాజీ, సీనియర్‌ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. రహీమ్‌ చర్యకు మ్యాచ్‌ రిఫరీ అతని ఫీజులో 25శాతం జరిమానా విధించాడు.తాజాగా రహీమ్‌ తాను చేసిన పనికి బాధపడుతున్నానని.. మళ్లీ ఇలాంటిది రిపీట్‌ కాకుండా చూసుకుంటాని ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులకు చెప్పుకొచ్చాడు.

'మ్యాచ్‌ సందర్భంగా తోటి క్రికెటర్‌పై నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మ్యాచ్‌ ముగిసిన వెంటనే నజుమ్‌ అహ్మద్‌కు క్షమాపణ కోరాను. ఒక మనిషిగా నేను అలా  ప్రవర్తించడం తప్పు. అతన్ని కొట్టడానికి చేయి చూపించడం సరైనది కాదు. అందుకే నా చర్యను తప్పుబడుతూ  క్రికెట్‌ అభిమానులకు.. ఆరోజు మైదానంలో ఉన్న ప్రేక్షకులకు మరోసారి క్షమాపణలు కోరుతున్నా. ఇలాంటి ఘటన నానుంచి మళ్లీ పునరావృతం కావని మీకు ప్రామిస్‌ చేస్తున్నా.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు.