ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ తన వ్యక్తిగత జీవితం విషయంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికింది. రగ్బీ ఆటగాడు మాట్ టూమువాతో పెర్రీ 2015లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరూ విడిపోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేశాయి. 

అయితే వాటిని టూమువాతో పాటు పెర్రీ కూడా కొట్టిపారేసింది. అయితే ఆదివారం వీరిద్దరూ కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. తామిద్దరం వివాహ బంధం నుంచి వైదొలుగుతున్నామని అందులో పేర్కొన్నారు. ఇద్దరం బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. కాగా.. ఈ వార్త పెర్రీ అభిమానులను ఎంతగానో కలిచివేసింది.

 

ఇదిలా ఉండగా... పెర్రీకి స్వదేశంతో పాటు.. ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆమె ఆటతోపాటు.. అందానికి చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో టీమిండియా క్రికెటర్, చెన్నైసూపర్ కింగ్స్ ప్లేయర్ మురళీ విజయ్ కూడా.. పెర్రీ విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. తనకు అవకాశం వస్తే... పెర్రీతో కలిసి డిన్నర్ చేయాలని ఉందని చెప్పాడు. ఆమె చాలా అందంగా ఉంటుందంటూ ప్రశంసలు కూడా కురిపించడం విశేషం. విజయ్ కోరికకు పెర్రీ కూడా సరదాగా స్పందించింది. డిన్నర్ బిల్లు విజయ్ కడతాడని తాను భావిస్తున్నానంటూ ఆమె అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆమె కామెంట్ అందరినీ ఆకట్టుకుంది.

అయితే.. ఇప్పుడు పెర్రీ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో.. నెటిజన్లు మురళీ విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. పెర్రీ ఈ విడాకుల విషయాన్ని ప్రకటించగానే.. మురళీ విజయ్ సంబరపడిపోతుంటాడు అనే అర్థం వచ్చేలా మీమ్స్ క్రియేట్ చేసి.. విజయ్ ని ట్రోల్ చేయడం గమనార్హం.