Guinness World Record: టెస్టు క్రికెట్ లో ఒక ఆటగాడు రోజంతా ఆడితేనే గొప్ప. క్రికెట్ అంతా టీ20 మయం అయిన ఈ నేపథ్యంలో ఓ కుర్రాడు ఏకధాటిగా మూడు రోజుల పాటు...
టెస్టు మ్యాచుల మీద ఆసక్తి తగ్గిపోయి.. అంతా ధనాధన్ క్రికెట్ మీద దృష్టి సారిస్తున్న వేళ ముంబైకి చెందిన ఓ కుర్రాడు మాత్రం సుదీర్ఘ ఫార్మాట్ లో రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు చిన్న వయసులోనే ఏకంగా 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా పట్టిన బ్యాట్ విడవకుండా.. కట్టిన ప్యాడ్ విప్పకుండా.. తొడిగిన గ్లౌజ్ విప్పకుండా.. వేసిన డ్రెస్ మార్చకుండా ఏకధాటిగా బ్యాటింగ్ చేశాడు. దేశానికి ఎంతో మంది నాణ్యమైన బ్యాటర్లను అందించే క్రికెట్ ఫ్యాక్టరీగా పేరున్న ముంబై నుంచే మరో కుర్రాడు ఈ ఘనత సాధించాడు. 19 ఏండ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన ఆ కుర్రాడి పేరు సిద్ధార్థ్ మోహితె..
ముంబైకి చెందిన సిద్ధార్థ్.. ఏకధాటిగా 72 గంటల ఐదు నిమిషాల పాటు నెట్స్ లో బ్యాటింగ్ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. ఈ కుర్రాడు.. 2015లో విరాగ్ మానే అనే క్రికెటర్ నెలకొల్పిన (50 గంటల పాటు నెట్స్ లో బ్యాటింగ్ చేశాడు) రికార్డును బద్దలు కొట్టాడు. విరాగ్ ను అధిగమించిన క్రమంలో అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డులలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్స్కర్కార్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్.. చెప్పుకుంటే పోతే ఈ జాబితాకు అంతులేదు. భారత క్రికెట్ లో ముంబై బ్యాటర్ల ఆధిపత్యానికి ఈ ఆటగాళ్లు మచ్చు తునక. వీరి సరసన చేరేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడు సిద్ధార్థ్.
అయితే తనలో ఎక్స్ ట్రా టాలెంట్ ఉందని ప్రపంచానికి చాటిచెప్పడానికే తాను ఇలా చేశానని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా తన కెరీర్ లో ఎంతో విలువైన రెండేండ్లు వృథాగా గడిచాయని, అది తనకు తీరని నష్టం చేకూర్చిందని చెప్పుకొచ్చాడు. అందుకే తనను తాను నిరూపించుకోవడానికి ఇలా చేశానని తెలిపాడు. తాను ఇలా చేస్తానని ఆలోచన రాగానే క్రికెట్ అకాడమీ, కోచ్ లను సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాకే బరిలోకి దిగానని అన్నాడు. అయితే కొంత మంది కోచ్ లు ముందు ఈ ఆలోచనకు అడ్డు చెప్పారని, అయినా వెనుకడుగు వేయలేదని తెలిపాడు.
ఇక ఈ యువ ఆటగాడు ఈ రేర్ ఫీట్ సాధించడంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ సంచలనం యశస్వి జైస్వాల్ కోచ్ పాత్ర ఎంతో ఉంది. అతడి వ్యక్తిగత కోచ్ జ్వాలా సింగ్ ను మెంటార్ గా నియమించుకున్న సిద్ధార్థ్.. అతడి పర్యవేక్షణలో ఈ ఫీట్ సాధించాడు. మరి సిద్దార్థ్ చేసిన ఈ అరుదైన ఫీట్ గిన్నిస్ ను సంతృప్తి పరుస్తుందా..? లేదా..? అంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
