వెస్టిండిస్ సీరిస్ తర్వాత భారత జట్టుకు కొత్త కోచ్ రానున్నాడు. ప్రపంచ కప్ తోనే ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయ కోచ్ ల పదవికాలం ముగిసింది. అయితే విండీస్ పర్యటనను దృష్టిలో వుంచుకుని వారి పదవీకాలాన్న మరికొంతకాలం పొడిగిస్తూనే నూతన కోచింగ్ సిబ్బంది కోసం బిసిసిఐ వేట ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్త కొత్త పేర్లు టీమిండియా చీఫ్ కోచ్ మరియు సహాయ కోచ్ ల రేసులో వినిపిస్తున్నారు. ఆ జాబితాలో ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్ తో పాటు ఫీల్డింగ్ కోచ్ కూడా వుండటం విశేషం. 

ప్రస్తుతం ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కోచ్, శ్రీలంక మాజీ సారథి మహేల జయవర్ధనే చీఫ్ కోచ్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పదవి కోసం బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించగా జయవర్ధనే అదేపనిలో వున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో అతడు టీమిండియా చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. 

ఇక ఇదే ముంబై ఇండియన్స్ కు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ కూడా రేసులో వున్నాడు. అయితే అతడు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా పనిచేసేందుకు కుతూహలం ప్రదర్శిస్తున్నాడట. అందుకోసం ఇప్పటికే అతడు బిసిసిఐ కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జయవర్దనే చీఫ్ కోచ్ నియమిస్తే మిగతా వారి విషయంలో అతడి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. అలా జరిగితే రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా పనిచచేయడం ఖాయం.   
 
అయితే రోడ్స్ నిజంగానే ఈ పీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాడా...లేదా అన్న విషయం ఇంకా అధికారికంగా బయటకురాలేదు. అయితే అతడి సన్నిహితులు మాత్రం రోడ్స్ దరఖాస్తు చేశాడని చెబుతున్నారు. అయితే అది నిజమో కాదో తెలియాలంటే ఈ పదవులకు దరఖాస్తు చేసుకోడానికి బిసిసిఐ విధించిన చివరి తేదీ జులై 30 వరకు ఆగాల్సి వుంటుంది.