సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 2020 నేపథ్యంలో అన్ని జట్లు యూఏఈకి చేరుకున్నాయి. అక్కడికి వెళ్లిన నాటి నుంచి క్వారంటైన్ నిబంధనలతో పాటు కఠినమైన ప్రాక్టీస్‌తో క్రికెటర్లు తలమునకలైపోయారు.

ఈ నేపథ్యంలో కాస్త విరామం దొరకడంతో కుటుంబంతో కలిసి గడిపేందుకు గాను ముంబై ఆటగాళ్లు బీచ్‌లకు పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై జట్టు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కెప్టెన్ రోహిత్‌ శర్మ అతని భార్య రితికా, కుమార్తె సమైరా, ఇతర ఆటగాళ్లు ఆదిత్య థారే, ధావల్ కులకర్ణి వారి పిల్లలతో కనిపించగా.. సూర్య కుమార్ యాదవ్ తన భార్యతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

కొందరు ఆటగాళ్లు బీచ్‌లో ఫుట్‌బాల్ ఆడగా.. మరికొందరు అలలతో పరుగులు తీశారు. రోహిత్ శర్మ తన భార్య, కుమార్తెతో కలిసి సూర్యుడు అస్తమిస్తుండగా తీసిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

 

 

 

కరోనా నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోనికి తీసుకుని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తమ ఆటగాళ్లు ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు గాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇందుకోసం భారీ రిక్రీయేషనల్ ఏరియాను ఏర్పాటు  చేసింది. ఇందులో స్విమ్మింగ్ పూల్ సహా వివిధ ఆటలు ఉన్నాయి. మరోవైపు గతేడాది ముంబై ఇండియన్స్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే.

 

 

దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలో దిగనుంది. సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై తలపడనుంది. మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయమై ఆ ఫ్రాంఛైజీ గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైన ఉంగరాలు అందించింది. అందరూ కచ్చితంగా వాటిని ధరించాల్సి ఉంటుంది.

దాంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, కరోనా లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడినా శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వీలు కలుగుతుంది.