భారత జట్టులో చాలా తక్కువ సమయంలో కీలక బౌలర్ గా ఎదిగిన ఆటగాడు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. కీలక సమయాల్లో ప్రత్యర్ధి బ్యాట్ మెన్స్ వికెట్లు పడగొట్టడం, డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో బుమ్రా స్పెషాలిటి. ఇలా మ్యాచ్ విన్నర్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న అతడికి దాదాపు ప్రపంచ కప్ బెర్తు ఖాయమయ్యింది. దీంతో ఐపిఎల్ కారణంగా గాయాలపాలయ్యే అవకాశం వుండటంతో ఈసారి బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ముంబై  జట్టు చీఫ్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే క్లారిటీ  ఇచ్చారు. 

ప్రపంచ కప్ కోసం కీలక ఆటగాళ్లకు ఐపిఎల్ నుండొ విశ్రాంతి  ఇవ్వాలనుకోవడం మంచిది కాదని జయవర్ధనే అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక బౌలర్ బుమ్రాను జట్టుకు దూరం చేయాలనుకోవడాన్ని తాను సమర్ధించబోనన్నారు. ఆ విషయంపై భారత క్రికెటర్లు నిద్రలేకుండా ఆలోచిస్తూ బుర్రలు పాడు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బుమ్రా ఈ ఐపిఎల్ ఆడతాడని జయవర్ధనె స్పష్టం చేశారు. 

మరికొద్దిరోజుల్లో చెన్నై వేధికన సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనున్న ఆరంభ మ్యాచ్ గురించి జయవర్ధనే మీడియాతో మాట్లాడారు.  ఈసందర్భంగా పని భారం పేరుతో కీలక ఆటగాళ్లకు ఐపిఎల్ నుండి  విశ్రాంతి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆయన కొట్టిపారేశారు. ఆటగాళ్ల విషయంలో భారత జట్టు ఎంత శ్రద్ద తీసుకుంటుందో...ఐపిఎల్ ప్రాంచైజీలు కూడా అంతే జాగ్రత్త తీసుకుంటాయన్నారు. అందువల్ల ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని జయవర్ధనే సూచించారు. 

ప్రపంచ కప్ కోసం బుమ్రాకు విశ్రాంతి  ఇవ్వాలని తాము అనుకోవడం లేదని వెల్లడించారు. తమ జట్టులో అతడు కీలకమైన ఆటగాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వల్ల  గాయాలపాలయ్యే అవకాశం వుందనడం ఉట్టి అపోహమాత్రమేనని కొట్టిపారేశారు. డెత్ ఓవర్లలో అటాకింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను అద్భుతంగా అడ్డుకునే బుమ్రా ఖచ్చితంగా గేమ్ చేంజర్...అలాంటి ఆటగాడు ఐపిఎల్ తమ జట్టు తరపున ఆడటం తమకు అదనపు బలమన్నారు. ఈ ఐపిఎల్ లో కూడా బుమ్రా తన సత్తా చాటతాడని జయవర్ధనే అభిప్రాయపడ్డారు.