దుబాయ్‌ : కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ 2020 సీజన్‌ కాస్త ఆలస్యమైనా నయా జోష్ తో ప్రారంభానికి సిద్దమైంది. అయితే ప్రతి ఏడాది స్వదేశంలో జరిగే ఈ టోర్నీ ఈసారి మాత్రం విదేశంలో జరుగుతోంది. ఈ టోర్నీ మొదలుకావడానికి కేవలం వారం రోజుల మాత్రమే వుంది.  దీంతో ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇలా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు సాధనను ముమ్మరం చేశారు. 

లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది. దీంతో ముంబై జట్టు మైదానంలో చెమటోడుస్తోంది. తాజాగా ముంబై ఆటగాళ్ల ప్రాక్టీస్‌ వీడియోలను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేస్తూ వచ్చింది. ఇలా ట్రెంట్ బౌల్డ్ మెరుపువేగంతో చేసిన బౌలింగ్, కెప్టెన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ కు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంది ముంబై జట్టు మేనేజ్ మెంట్. 

ముంబై జట్టుకు చెందిన న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ జట్టుతో కలిసి సాధనలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో కళ్లుచెదిరే వేగంతో బంతులను విసురుతూ ప్రాక్టీస్ లోనే సొంత జట్టు ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఆలా అతడి మెరుపు వేగంతో విసిరిన ఓ బంతి స్టంప్స్ ను రెండు ముక్కలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా  అభిమానులతో పంచుకుంది ముంబై జట్టు.  

 

ఇక మొన్నటి ప్రాక్టీస్‌ లో సిక్సులతో రెచ్చిపోయిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఫీల్డింగ్‌ తో అదరగొట్టాడు. ఇటీవల జట్టుతో కలిసి ఫీల్డింగ్ ప్రాక్టీస్‌  చేసిన రోహిత్‌ ఓ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. ఎడమ పక్కకు ఒరిగి ఒంటి చేత్తో డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ వీడియోను కూడా ముంబై ఇండియన్స్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.