న్యూఢిల్లీ:  భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌తో పాటు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు జరిమానా విధించే విషయంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని వినూత్నంగా ఆలోచించిన విషయాన్ని జట్టు మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్‌ వెల్లడించాడు. ఆ విషయాన్ని తన పుస్తకం ద బేర్‌ఫుట్‌ కోచ్‌లో వెల్లడించాడు. 

అప్పట్లో టెస్ట్‌లకు కుంబ్లే, వన్డేలకు ధోని కెప్టెన్లుగా ఉండేవారు. ప్రాక్టీస్‌కు, జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లను శిక్షించే అంశాన్ని కెప్టెన్లకు వదిలేశారని ప్యాడీ ఆప్టన్ చెప్పారు. దాంతో ఆలస్యంగా వచ్చే వారికి రూ. 10వేలు జరిమానా విధించాలని టెస్ట్‌ సారథి కుంబ్లే అభిప్రాయపడ్డాడని, కానీ ధోని అందుకు భిన్నంగా ఆలోచించాడని,  ఎవరైనా క్రికెటర్‌ నిర్ణీత సమయానికి రాకపోతే జట్టు సభ్యులు ఒక్కొక్కరూ రూ. 10వేలు చెల్లించాలని ఆదేశించాడని చెప్పాడు. 

ఆ తర్వాత ఒక్కరంటే ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్‌కు, జట్టు సమావేశాలకు ఆలస్యంగా రాలేదని ప్యాడీ ఆప్టన్‌ తెలిపాడు. ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనిపై ఆప్టన్‌ ప్రశంసలు కురిపించాడు. ధోని కూల్‌గా ఉండటమే జట్టుకు నిజమైన బలమని అన్నాడు. 

పరిస్థితిని బట్టి మ్యాచ్‌ను అర్ధం చేసుకునే తీరులో ధోనినే మేటి అని ప్రశంసించాడు. ధోని ఒక బలమైన నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు.