Asianet News TeluguAsianet News Telugu

సస్పెన్స్‌కు చెక్ : ఐపీఎల్ 2024లో ఆడనున్న ఎంఎస్ ధోనీ.. సీఎస్క్‌ రిటెన్స్ లిస్ట్‌తో క్లారిటీ, ఫ్యాన్స్ సంబరాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం రిటెన్షన్, ఆటగాళ్ల రిలీజ్ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. దీనిలో భాగంగా చెన్నై కూడా ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌లో ధోనీ పేరు లేకపోవడంతో ఆయన మరో ఏడాది ఐపీఎల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నట్లే లెక్క.

MS Dhoni set to play IPL 2024 after CSK releases retention list ksp
Author
First Published Nov 26, 2023, 5:34 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ ద్వారా కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అయితే వయసు పెరుగుతూ వుండటంతో ఆయన ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. గతేడాది ఇది తారా స్థాయికి చేరగా.. తన ఫిట్‌నెస్ , ఆటపై వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతూ చెన్నై సూపర్ కింగ్స్‌ని 2023 ఐపీఎల్ విన్నర్‌గా నిలబెట్టాడు. కానీ 2024 ఐపీఎల్‌ నుంచి మాత్రం ధోని తప్పుకుంటాడనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. ప్రస్తుతం 42 ఏళ్ల వయసులో వున్న ధోనీ.. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌లో చివరిసారిగా కనిపించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సీఎస్కే అభిమానుల మద్ధతుతో ఐదవసారి టైటిల్‌ను ముద్దాడాడు. 

 

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం రిటెన్షన్, ఆటగాళ్ల రిలీజ్ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్ల మధ్య ట్రేడింగ్ జరిగింది. దీనిలో భాగంగా చెన్నై కూడా ఆటగాళ్లను రిలీజ్ చేసింది. దీని ప్రకారం అంబటి రాయుడు (రిటైర్‌మెంట్), ప్రిటోరియస్, జేమీసన్, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, సేనాపతి, సిసింద మగల, ఆకాశ్ సింగ్‌లను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది . తద్వారా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 32.2 కోట్లు మొత్తంతో పాటు 9 స్లాట్‌లు వున్నాయి. ఇందులో ఆరుగురు స్వదేశీ, ముగ్గురు విదేశీ ఆటగాళ్లను దక్కించుకునే అవకాశం వుంది. ఈ లిస్ట్‌లో ధోనీ పేరు లేకపోవడంతో ఆయన మరో ఏడాది ఐపీఎల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నట్లే లెక్క. ఇది ధోనీ అభిమానులను సంతోష పెట్టే వార్త. 

ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత అదే ధోని చివరి మ్యాచ్‌గా చాలా మంది భావించారు. కానీ ఆయన తన ఐపీఎల్ కెరీర్‌ మరో ఏడాది పొడిగించే అంశంపై సంకేతాలిచ్చారు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ చేసిన 18 రిటెన్షన్‌లో మహీ కూడా వున్నాడు. కానీ బెన్‌స్టోక్స్, కైల్ జామీసన్ వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీ వదులుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ధోనీతో పాటు రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, మొయిన్ అలీ, దీపక్ చాహర్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‌ వంటి స్టార్లు సీఎస్కే‌లో కొనసాగుతున్నారు. మిగిలిన జట్టు సభ్యుల విషయానికి వస్తే.. డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్, సిమర్‌జిత్ సింగ్, నిషాంత్ సింధూ, ప్రశాంత్ సోలంకీ, మహేశ్ తీక్షణ వున్నారు. క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ ఆక్షన్ డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios