రాంచీ: క్రికెట్ క్రీడకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వివిధ కార్యక్రమాల ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా ఆయన కొత్త పాత్ర పోషించాడు. తన జట్టు మాజీ సహచరులు ఆర్పీ సింగ్, పియూష్ చావ్లాలకు పానీపూరీలు సర్వ్ చేస్తూ కనిపించాడు. బహుశా మాల్దీవుల్లో ధోనీ పానీపూరీ స్టాల్ వద్ద నించున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పానీ పూరీ స్టాల్ వద్ద ధోనీ నలబడి ఉండగా, మరోవైపు ఆర్పీ సింగ్, పియూష్ చావ్లా నించుని ఉండడం వీడియోలో కనిపిస్తోంది. ధోనీ ఓ పూరీ తీసుకుని దాంట్లో అవసరమైన పదార్థాలను కలుపుతూ కనిపించాడు. పానీని పదార్థాలతో నింపి సింగ్ ప్లేట్లో పెట్టాడు.

ఆర్పీ సింగ్ తాజాగా బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి మహి అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ప్రపంచంలో తన అత్యంత అభిమానమైన విషయాలు మహీష పానీపూరి అని మరో యూజర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు మహీ భాయ్ పానీ పూరీ తినిపిస్తున్నాడు, బౌలర్లకు సిక్సర్లు తినిపిస్తాడు అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

2019 జులైలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ధోనీ చివరిసారి ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ కు దూరంగానే ఉన్నాడు. ఆటగాళ్ల కాంట్రాక్టుల జాబితా నుంచి ధోనీ పేరును బీసీసీఐ తొలగించింది.