ప్రపంచకప్ చివరి దశకు వచ్చిన దగ్గర నుంచి అందరినోటా ఎక్కువ నానుతున్న టాపిక్ టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్. వరల్డ్ కప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ తీసుకోనున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ధోనీ స్పందించింది లేదు. అంతేకాదు... వచ్చే నెలలో జరగనున్న విస్టిండీస్ పర్యటనకు కూడా ధోనీని దూరం పెడుతున్నారనే ప్రచారం కూడా మొదలయ్యింది. కాగా.. ఈ విషయంపై ధోనీ చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జి స్పందించారు.

ధోనీ రిటైర్మెంట్ గురించి అతని తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో కోచ్ కేశవ్ బెనర్జీ వివరించారు.  ధోనీ క్రికెట్ కి గుడ్ బై  చెప్పాలని అతని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కేశవ్ తెలిపారు. గత ఆదివారం తాను ధోనీ తల్లిదండ్రులతో మాట్లాడినట్లు ఆయన మీడియాకు వివరించారు. ధోనీ క్రికెట్ ని విడిచి పెడితే బాగుంటుందని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు.

క్రికెట్ కి వీడ్కోలు పలికితే... ఇక నైనా తమ కుమారుడు తమతో సమయం గడిపే అవకాశం దొరుకుతుందని వారు భావిస్తున్నారని కేశవ్ తెలిపారు. అయితే... వారి నిర్ణయంతో తాను ఏకీభవించలేదని ఆయన అన్నారు. మరో సంవత్సరం పాటు ధోనీ రిటైర్మెంట్ ఆలోచన విరమించుకుంటే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదనేది తన నిర్ణయమని చెప్పారు.