టీమిండియా మాజీ కెప్టెన్ , కెప్టెన్ కూల్.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. వెంటనే గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటికీ.. ఆయన స్టేడియంలో ఆట ఆడుతుంటే.. ఎవరైనా ఫిదా కావాల్సిందే. తోటి క్రికెటర్లు.. ముఖ్యంగా యువ క్రికెటర్లు.. ధోనీతో మాట్లాడటానికి ఎదురుచూస్తూ ఉంటారు.

ఎప్పుడెప్పుడు ధోనీతో మాట్లాడే సమయం దొరుకుతుందా..? అతని నుంచి ఏ కొత్త విషయం నేర్చుకుందామా అని ఆశపడుతుంటారు. ఇప్పటి వరకు చాలా మంది అలా ధోనీ దగ్గర నుంచి కీలక విషయాలు నేర్చుకున్నారు. తాజాగా.. ఇప్పుడు యువ క్రికెటర్ షారూక్ కి ఆ అవకాశం దక్కింది.

శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్ తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం చెన్నైకే దక్కింది. కాగా.. మ్యాచ్ అనంతరం ధోనీతో.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు షారూక్ ఖాన్ కనిపించాడు. ఈ క్రమంలో.. తనకున్న సందేహాలను షారూక్.. ధోనీ ని అడిగి తెలుసుకున్నాడు.

 

కాగా.. ధోనీ సైతం తనకు తెలిసిన విషయాలను తెలియజేశాడు. అంతేకాకుండా.. షారూక్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీలో తమిళనాడుకు ఫినిషర్ గా షారూక్ గొప్ప విజయాలు అందించిన సంగతి తెలిసిందే. ఇది షారూక్ కి ఐపీఎల్ తొలి సీజన్. వేలంలో రూ.5కోట్లకుపైగా పలికాడు. దీంతో.. అతనిపై కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉందనే చెప్పాలి.

ఈ క్రమంలో.. మహీతో మాట్లాడే అవకాశం దొరకడంతో సద్వినియోగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వగా.. నెటిజన్లు మురిసిపోతున్నారు. ‘ ఒక ఫినిషర్.. మరొకరు రూపొందుతున్న ఫినిషర్’ అంటూ పంజాబ్ కింగ్ ట్వీట్ చేయడం విశేషం. కాగా.. నిన్నటి మ్యాచ్ లో షారూక్ అదరగొట్టాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.