ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ఆరంభం కాబోతోన్న విషయం తెలిసిందే. లీగ్‌ కోసం ఎనిమిది ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఆటగాళ్ల ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం సన్నాహాలు మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆటగాళ్లు తమ సొంతూళ్లలోనే కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాయి. 

బీసీసీఐ ఎస్‌ఓపీ నిబంధనల ప్రకారం యూఏఈకి బయల్దేరడానికి వారం ముందే 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చాలా జట్లు బీసీసీఐ నిర్దేశించిన ఆగస్టు 20 తర్వాత భారత్‌ నుంచి యూఏఈకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. 

మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం ఆగస్టు 22న బయలుదేరాలనుకుంటున్నది. ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే తన జట్టు ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు ముందుజాగ్రత్త చర్యగా కరోనా టెస్టుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.

యుఏఈలో ఐపీఎల్‌ నిర్వహణపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. సెప్టెంబర్‌ 19-నవంబర్‌ 10 వరకు నిర్వహిస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్‌ నిర్వహణకు స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌, ఎనిమిది బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టి, కోవిడ్‌19 ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపిక నిబంధనలు, విదేశీ ఆటగాళ్లను యుఏఈకి రప్పించటం, క్రికెటర్ల శిక్షణ శిబిరాల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టత కోసం ప్రాంఛైజీలు, అభిమానులు ఎదురుచూశారు. 

షెడ్యూల్‌ ఖరారు, ఇతర అంశాలపై స్పష్టత రావటంతో ఇప్పుడు అందరి దృష్టి బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టిపై పడింది. బీసీసీఐ కార్యదర్శి జై షా త్వరలో ప్రాంఛైజీ యాజమాన్యాలతో సమావేశం అయ్యాడు. స్టాండర్ట్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌, కుటుంబ సభ్యులకు ప్రవేశం సహా బయో సెక్యూర్‌ బబుల్‌పై ప్రాంఛైజీలకు వివరించారు.

ఆదివారం సమావేశమైన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు టాటా గ్రూప్‌ మెడికల్‌ విభాగం బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఇతర కంపెనీల ప్రజెంటేషన్లను సైతం పరిశీలించిన బీసీసీఐ.. టాటా వైపు మొగ్గుచూపుతోందని సమాచారం.